మహారాణిపేట (విశాఖ దక్షిణ): తన హయాంలో యువతను నిర్వీర్యం చేసిన చంద్రబాబు నిరుద్యోగం గురించి మాట్లాడటం సిగ్గుచేటని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలోని విక్టోరియా ఆస్పత్రిలో సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన హైరిస్క్ ప్రసూతి వార్డును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రజిని మీడియాతో మాట్లాడుతూ.. బాబు హయాంలో ఏ ఆస్పత్రికీ నిధులు ఇవ్వలేదని, ఎలాంటి నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే తన పాలనలో ఎన్ని నియామకాలు చేపట్టారో, కొత్తగా ఎన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలలు నిర్మించారో చెప్పాలన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనలో వైద్య ఆరోగ్యశాఖలో 46 వేలకు పైగా పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. నాలుగు లక్షల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు.
పెట్టుబడులపై దుష్టచతుష్టయం విష ప్రచారం
రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై దుష్టచతుష్టయం విష ప్రచారానికి తెరలేపిందని మంత్రి రజిని మండిపడ్డారు. అమరరాజా సంస్థ విస్తరణ కోసం తెలంగాణకు వెళ్తే దాన్ని రాజకీయం చేస్తున్న నీచ సంస్కృతి చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చ మీడియా, అబద్ధాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు వైజాగ్‌లో పారిశ్రామిక వృద్ధి గురించి ఆలోచించాలన్నారు. సీఎం దావోస్ పర్యటన తర్వాత విశాఖకు తరలివస్తున్న పెట్టుబడులు, పరిశ్రమల గురించి వారు తెలుసుకోవాలని హితవు పలికారు. అదానీ, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు విశాఖపట్నంలో పెడుతున్న పెట్టుబడులు చంద్రబాబుకు, పచ్చ మీడియాకు ఎందుకు కనిపించట్లేదని నిలదీశారు. ఐటీ హబ్‌గా విశాఖను మార్చేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్నారు.
చంద్రబాబు బీసీల ద్రోహి
ప్రతిపక్ష నేత చంద్రబాబు బీసీల ద్రోహి అని రజిని ధ్వజమెత్తారు. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు. బీసీలను వెనుకబడిన కులాలుగానే చూశారని దుయ్యబట్టారు. వారి ఎదుగుదలకు ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి అవకాశాలు ఇవ్వని చంద్రబాబును బీసీలు ఎప్పటికీ క్షమించరని తేల్చిచెప్పారు. మరోవైపు బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేలా చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. మంత్రి పదవుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీలకు పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. తద్వారా బీసీలకు బ్యాక్ బోన్‌గా నిలిచారని కొనియాడారు. జగనన్న పాలనతో బీసీలకు భరోసా, భద్రత దొరికాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment