కాకినాడ రూరల్ సీటు పిల్లి అనంతలక్ష్మికి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం చేస్తున్న టీడీపీ కార్యకర్త లోవరాజు
సాక్షి నెట్‌వర్క్: టీడీపీలో టికెట్ల కేటాయింపులపై ఆ పార్టీలో నిరసనలు ఎగసిపడ్డాయి. అనేక చోట్ల చంద్రబాబు మోసంపై నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. చంద్రబాబు తమను నమ్మించి నట్టేట ముంచారని సీనియర్లు, నియోజకవర్గ ఇన్‌చార్‌్జలు, కార్యకర్తలు నిరసన తెలుపుతూ రోడ్డెక్కారు. కొన్ని చోట్ల కార్యకర్తలు, నేతలు ఆత్మహత్యాయత్నాలు చేశారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పాటుపడితే ప్రజలతో సంబంధాలు లేని కొత్తవారికి టికెట్ ఇచ్చారని.. తమకు టికెట్ ఇవ్వకపోతే టీడీపీ–జనసేన అభ్యర్థుల్ని ఓడిస్తామని హెచ్చరించారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ముందు ధర్నా చేస్తున్న అసమ్మతి నేతలు, కార్యకర్తల్ని బాబు బుజ్జగించేందుకు ప్రయత్నించినా ససేమిరా అంటూ వెనుదిరిగారు.
ఉండవల్లిలో తంబళ్లపల్లె తమ్ముళ్ల నిరసన
తంబళ్లపల్లె టికెట్‌ను పార్టీలో కనీసం గుర్తింపు లేని వ్యక్తికి ఎలా ఇస్తారని, టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌కు ఇవ్వాల్సిందేనంటూ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిముందు బైఠాయించి ఆందోళన చేశారు. పెట్రోలు డబ్బాలు చూపుతూ ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసనలతో హోరెత్తించారు. శంకర్‌కు టికెట్ ఇవ్వకపోతే టీడీపీని ఓడిస్తామని నినదించారు. చంద్రబాబును కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో గేట్లు దాటుకుని ముందుకు వెళ్లారు. శంకర్ యాదవ్‌ను అభ్యర్ధిగా ప్రకటించకపోతే ఆత్మహత్యకైనా సిద్ధమంటూ ముగ్గురు కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకునేందుకు ప్రయత్నించారు.
అది గమనించిన తాడేపల్లి సీఐ అడ్డుకున్నారు. త్రీమెన్ కమిటీ సభ్యులు కొల్లు రవీంద్ర, నెట్టెం రఘురాం, కొననళ్ల నారాయణలు వారిని వారించే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన చంద్రబాబు తంబళ్లపల్లి నేతలపై అసహనం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరికి తెలియదని, అలాంటప్పుడు ఆ వ్యక్తి సర్వేలో ముందంజలో ఉండటం ఎలా సాధ్యమని ప్రశ్నించగా.. ఏయ్ ఆగు..ఆగు అంటూ చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పార్టీకి రాజీనామా చేశామని చంద్రబాబుకు చెప్పడంతో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఎవరికి సీటివ్వాలో తనకు తెలుసని, తనను డిక్టేట్ చేయవద్దని బాబు హెచ్చరించారు.
కాకినాడ రూరల్‌లో కార్యకర్త ఆత్మహత్యాయత్నం
కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి వర్గీయులు సోమవారం నిరసనలతో హోరెత్తించారు. వలసపాకలలోని పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ దంపతుల ఇంటి వద్ద రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ ఫ్లెక్సీలు చించేశారు. కార్యకర్త వెలగ లోవరాజు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. టీడీపీకి రాజీనామా చేయాలని పిల్లి అనంతలక్ష్మి దంపతుల్ని కార్యకర్తలు డిమాండ్ చేశారు. కార్యకర్తలతో మార్చి 2, 3 తేదీల్లో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చిస్తామని అనంతలక్ష్మి తెలిపారు.
జెండా విలువ తెలియని వ్యక్తికి టికెట్ ఇస్తారా?: మాదినేని
కళ్యాణదుర్గం అసెంబ్లీ టికెట్ విషయంలో చంద్రబాబు తనకు అన్యాయం చేశారని, కనీసం జెండా విలువ కూడా తెలియని వ్యక్తికి టికెట్ ప్రకటించడం బాధాకరమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాదినేని ఉమా మహేశ్వరనాయుడు అన్నారు. కళ్యాణదుర్గంలోని సోమవారం కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కళ్యాణదుర్గంలో బాబు ష్యూరిటీ..భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్‌్జగా ఉమా ఉన్నారని.. సరైన సమయంలో ఆయనను అభ్యర్థిగా ప్రకటిస్తానని చెప్పారని గుర్తుచేశారు. ఏ రోజూ జెండా పట్టని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం సహించలేనిదన్నారు. టీడీపీ జెండాను భుజాన వేసుకుని పనిచేయడం నేను చేసిన తప్పా? పార్టీ కోసం ఆస్తులన్నీ అమ్ముకుని పనిచేయడం తప్పా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
దొంగ, స్మగ్లర్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తారా?
నగరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధిగా గాలి భానుప్రకాష్‌ను ప్రకటించడంపై స్థానిక టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఒకటో వార్డులో టీడీపీ సీనియర్ నాయకుడు రామానుజం చలపతి, మాజీ కౌన్సిలర్ లత స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సామాలమ్మ ఆలయ ఆవరణలో చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో పాటు ఇసుక, గ్రావెల్, బియ్యం, గంజాయిని తలపించేలా ఆకులు, ఎర్రచందనం కట్టలు పట్టుకొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గంజాయి స్మగ్లర్లు, గ్రావెల్ దొంగలు, బియ్యం స్మగ్లర్లు, లిక్కర్ స్మగ్లరు, కంకర దొంగలు, చందనం స్మగ్లర్లు అభ్యర్థులుగా వద్దంటూ నినాదాలు చేశారు. రామానుజం చలపతి మాట్లాడుతూ.. నగరిలో దొంగలు, స్మగ్లర్లకు పదవులు ఇచ్చారని, నగరి సంపదను దోచుకుని తినే వ్యక్తిని అభ్యర్థిగా ఎన్నుకుంటే మేము ఓట్లు వేయాలా? అంటూ ప్రశ్నించారు.
బాబు చేతుల్లో మరో బీసీ నేత బలి
పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద్‌బాబుకు చంద్రబాబు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అరవింద్‌బాబు 2019 ఎన్నికల ముందు నుంచి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. టికెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్న చదలవాడను తప్పించేందుకు చంద్రబాబు ఐవీఆర్‌ఎస్ పేరుతో ఎత్తులు వేస్తున్నారు. గతంలో నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై ఐవీఆర్‌ఎస్ సర్వేలో చదలవాడ అరవింద్‌బాబు, కడియాల వెంకటేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, అట్ల చిన్నవెంకటరెడ్డి పేర్లతో అభిప్రాయ సేకరణ చేశారు. తాజాగా సోమవారం సర్వేలో ఐవీఆర్‌ఎస్ కాల్‌లో కేవలం గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పేరుతో మాత్రమే సర్వే నిర్వహించారు. యరపతినేని ఎంపిక దాదాపు పూర్తయ్యిందని, కార్యాలయం ఏర్పాటు ముమ్మరంగా జరుగుతోందని టీడీపీ నేతలు అంటున్నారు.
నిడదవోలులో కందుల దుర్గేష్‌కు సెగ
జనసేన నేత కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నిడదవోలు పట్టణ అధ్యక్షుడు కొమ్మున వెంకటేశ్వరరావు అధ్యక్షతన సోమవారం సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సైతం వెనుకాడబోమని అల్టిమేటం జారీ చేశారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలూ కృషి చేసిన శేషారావు వంటి నేతకు సీటు ఇవ్వకపోతే సహించేది లేదని, చంద్రబాబు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. నిడదవోలు టీడీపీ టికెట్ ఆశించిన కుందుల సత్యనారాయణ టికెట్ దక్కదనే మనస్తాపంలో అనారోగ్యానికి గురయ్యారు.
గోరంట్ల గెలుపు కష్టమే!
రాజమహేంద్రవరం రూరల్‌లో జనసేన శ్రేణులు కందుల దుర్గేష్‌కు టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే రోడ్డెక్కి తమ నిరసనను వెలిబుచ్చారు. దీంతో రూరల్‌లో టీడీపీ అభ్యర్థిగా భావిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపు కష్టమేనంటున్నారు. రాజానగరంలో జనసేనకు టికెట్ కేటాయింపుపై టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. పార్టీ సోషల్ మీడియాకు రూ.కోట్లు ఖర్చు పెట్టిన టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరిని కాదని జనసేనకు కేటాయించడంపై ఆయన వర్గం మండిపడుతోంది.
30 ఏళ్లుగా శ్రమిస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా
టీడీపీ కోసం 30 ఏళ్లుగా పనిచేస్తున్న మాజీ మంత్రి పరసా వెంకటరత్నంకు పార్టీ అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన కుమార్తె పరసా షాలినీ రత్నం ఆవేదన వ్యక్తం చేశారు. నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేటలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. సూళ్లూరుపేట(ఎస్సీ)నియోజకవర్గం టికెట్ రత్నంకు ఇవ్వకపోవడంపై పరసా రత్నంతో పాటు నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. జనాలతో సంబంధం లేని మహిళకు పార్టీ టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు.
టీడీపీ నేత ఆకెపోగు ఆత్మహత్యాయత్నం
చంద్రబాబు తనకు కోడుమూరు టికెట్ ఇవ్వకుండా మోసం చేశాడనే బాధతో నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్ పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కోడుమూరు టికెట్‌ను బొగ్గుల దస్తగిరికి కేటాయించడంతో ప్రభాకర్ తీవ్ర మనస్తాపానికి గురై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నెల 25న గద్వాలలోని తన సమీప బంధువుల ఇంటికి వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గద్వాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. చంద్రబాబు తమకు అన్యాయం చేశాడంటూ ఆయన భార్య మీడియా ముందు వాపోయారు.
తూర్పులో బీసీల భగభగ
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీలో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి తొలి జాబితాలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కలేదని రగిలిపోతున్నారు. టీడీపీ నుంచి శెట్టిబలిజ సామాజికవర్గం కాకినాడ రూరల్, రామచంద్రపురం, కొత్తపేట, రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానాలను ఆశిస్తోంది. రామచంద్రాపురంలో టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న శెట్టిబలిజ నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఇప్పుడు సీటు ఇవ్వకుండా తరువాత ప్రాధాన్యం ఇస్తామని చెప్పడంపై ఆ వర్గం మండిపడుతోంది. కొత్తపేటలో కాపు సామాజికవర్గంతో సమానం బలం ఉన్న తమకు సీటు ఇవ్వకపోవడంపై ఆ నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీకి ఎన్నికల్లో మద్దతుపై వారు పునరాలోచనలో పడ్డారు. రాజమహేంద్రవరం రూరల్‌ను కూడా చంద్రబాబు సామాజికవర్గానికి కట్టబెట్టి తమను విస్మరిస్తున్నారని బీసీల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment