ఈవీఎంలు పూణెకు తరలిస్తున్న దృశ్యం
ఒంగోలు: ఈద్ మిలాద్–ఉన్–నబీ పండుగ సందర్భంగా ముస్లింలకు మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, మాజీమంత్రి శిద్దా రాఘవరావులు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్ మిలాద్–ఉన్–నబీ పండుగ సమాజంలో శాంతి, సంతోషం పెంపొందించాలని, ప్రేమ, సౌభాతృత్వంతో కూడిన ఆయన జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
● కలెక్టర్ దినేష్‌కుమార్
ఒంగోలు అర్బన్: జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ ఆప్షన్ 3 కింద లబ్ధిదారులకు జేఎన్‌ఆర్ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించి ఇస్తున్న ఇళ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. మార్కాపురం, పొదిలిలో ఆప్షన్ 3 కింద జేఎన్‌ఆర్ సంస్థ నిర్మిస్తున్న 3465 ఇళ్ల నిర్మాణ పురోగతిని హౌసింగ్ పీడీ పేరయ్య కలెక్టర్‌కు వివరించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలన్నీ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో హౌసింగ్ డీఈఈలు పవన్, చెన్నారాయుడు, జేఎన్‌ఆర్ మేనేజింగ్ పార్టనర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
పాత ఈవీఎంలు పూణెకు తరలింపు
ఒంగోలు అర్బన్: స్థానిక భాగ్యనగర్‌లో ఈవీఎం గోదాములో ఉన్న 2019 అసెంబ్లీ, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను బుధవారం ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో మహారాష్ట్రలోని పూణెలోని బెల్ కంపెనీకి తరలించారు. ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల, కందుకూరు నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించిన 10,256 బ్యాలెట్ యూనిట్‌లు, 7484 కంట్రోల్ యూనిట్‌లు, 17,739 ఈవీఎంలు పూణెకు తరలించారు. దీనిలో ఎన్నికల విభాగం అధికారులు సిబ్బంది ఉపేంద్ర, నవీన్, వైఎస్‌ఆర్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు కాలేషా బేగ్, రసూల్, గుర్రం సత్యం తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ జూనియర్ సివిల్ జడ్జిగా శివనాయక్
యర్రగొండపాలెం: పట్టణానికి చెందిన వి.శివనాయక్ తెలంగాణ స్టేట్ జ్యూడిషియల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆయన బీఏఎల్‌ఎల్‌బీలో ఉస్మానియా యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి మాస్టర్ ఇన్ లా పూర్తి చేశారు. వాషింగ్టన్ డీసీ స్కూల్ ఆఫ్ ఐపీఆర్ యూనివర్శిటీ నుంచి ‘పేంటెంట్ లా’ సర్టిఫికెషన్ కోర్స్ పూర్తి చేసిన ఆయన అక్టోబర్ 3వ తేదీ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. శివనాయక్ పూర్వీకులు తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లా విప్లపల్లికి చెందిన వారు అయినా ఆయన తండ్రి హరినాయక్ ఉద్యోగరీతా యర్రగొండపాలెంలో విద్యుత్ శాఖ లైన్‌మెన్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం ఆయన గిద్దలూరులో ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్నారు. హరినాయక్ సోదరుడు వి.తిరుపతినాయక్ అడ్వొకేట్‌గా హైదరాబాదులో విధులు నిర్వహిస్తున్నారు.
2న టేబుల్ టెన్నిస్ క్రీడాజట్ల ఎంపిక
ఒంగోలు: ప్రకాశం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న అండర్ 17, అండర్ 19 బాలబాలికలు, సీనియర్ క్రీడాజట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి కె.రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 10 గంటలకు స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న అకాడమీలో రిపోర్టు చేయాలన్నారు. ఇందుకోసం తమ పేర్లను ముందుగా 8019762584 వాట్సప్‌కు పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment