21, 22న హెడ్‌మాస్టర్స్ అకౌంట్ టెస్ట్
ఒంగోలు సిటీ: డిసెంబరు 21, 22వ తేదీల్లో విజయవాడలోని గాంధీజీ మునిసిపల్ హైస్కూల్లో హెడ్‌మాస్టర్స్ అకౌంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ కోరారు.
రేపు ఫెన్సింగ్ జిల్లా క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: ఫెన్సింగ్ జిల్లా క్రీడాకారుల ఎంపిక ఈనెల 19న స్థానిక మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఏపీ ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికకు 18 సంవత్సరాల్లోపు వారు మాత్రమే హాజరుకావాలి. హాజరయ్యేవారు తప్పనిసరిగా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కార్డు తప్పక వెంట తీసుకురావాలి. వీటితోపాటు గతంలో ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్ కూడా తీసుకుని రావాలని కోరారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు ఈనెల 21 నుంచి 23 వరకు విజయవాడలోని ఐజీ మున్సిపల్ స్టేడియంలో డీఎస్‌ఏ హాలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్ నం: 7671991147ను సంప్రదించాలని నవీన్ కోరారు.
20న ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ చెస్ పోటీలు
ఒంగోలు: స్థానిక హైదరీక్లబ్‌లో ఈనెల 20న ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్‌కె నబీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఓపెన్, ఉమెన్ విభాగాల్లో జరుగుతాయి. ఆసక్తిగల వారు పూర్తి వివరాల కోసం 9666725719ను సంప్రదించాలన్నారు.
జేఎన్‌టీయూకే మహిళా బాస్కెట్ బాల్ జట్టుకు మంజు
ఒంగోలు సిటీ: కొట్టాయంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరిగే మహిళా బాస్కెట్ బాల్ పోటీల్లో జేఎన్‌టీయూకే తరఫున ఆడే 12 మంది టీంలో ఒంగోలు రైజ్ కృష్ణసాయి ప్రకాశం గ్రూప్‌నకు చెందిన విద్యార్థిని బండి మంజు ఎంపికై నట్లు కళాశాలల సెక్రటరీ శిద్దా హనుమంతరావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ఏ.వి.భాస్కరరావు మాట్లాడుతూ యూనివర్సిటీ తరఫున ఆడేందుకు ప్రతిభ గల 12 మంది సభ్యుల్లో రైజ్ కళాశాలకు చెందిన ఈసీఈ మూడో సంవత్సరం విద్యార్థిని బండి మంజు ఉండటం హర్షదాయకమన్నారు. ఎంపికై న విద్యార్థినికి ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు. ఎంపికై న జట్టు ఈ నెల 20 వ తేది నుంచి 24 తేది వరకు జరిగే పోటీలలో ఆడతారని ఫిజికల్ డైరెక్టర్ ఎస్.హిమచంద్రబాబు, ఎన్.సుబ్బారావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపికై న విద్యార్థిని కళాశాల గౌరవ చైర్మన్ ఇస్కాల చినరంగమన్నారు, రాగ చీఫ్ అడ్వైజర్ శిద్దా ప్రవల్లిక అభినందించారు.
బిల్లుల భారం దించండి
● కరెంటు బిల్లులను దహనం చేసిన సీపీఎం
ఒంగోలు టౌన్: భారీగా పెంచిన విద్యుత్ బిల్లులకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ట్రూఅప్ చార్జీలు, సర్‌చార్జీల పేరుతో బిల్లులు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం నాయకులు కరెంటు బిల్లులను దహనం చేశారు. మంగళవారం నగరంలోని 60 అడుగుల రోడ్డు జంక్షన్‌లో సీపీఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి జి.రమేష్ మాట్లాడుతూ.. ట్రూ అప్ చార్జీల పేరుతో రూ.17 వేల కోట్లను ప్రజలపై మోపడం దారుణమన్నారు. ఇంతపెద్ద మొత్తంలో ప్రజలపై భారం వేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలను పెంచమంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు గెలిచి గద్దెనెక్కిన తరువాత దొడ్డిదారిలో ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై భారం వేయడం మోసం చేయడమేనని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మాలకొండయ్య, జి.ఆదిలక్ష్మి, బాలకృష్ణ, ఆదినారాయణ, పాపని సుబ్బారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment