సర్పంచ్‌లకు గౌరవమేదీ?
పొదిలి రూరల్: గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల గౌరవాన్ని అధికారులు కాలరాస్తున్నారు. గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచ్‌లకు కూటమి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం పొదిలి మండలంలోని అక్కచెరువు, ఓబులక్కపల్లి గ్రామాల్లో సంఘటనే అందుకు నిదర్శనం. ఆయా గ్రామాల్లో గోకులం, ఫారం పాండ్, సీసీ రోడ్ల పనులను పంచాయతీరాజ్ రూరల్ డెవెలప్‌మెంట్ అధికారి శివప్రసాద్, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, చీఫ్ విజిలెన్స్ అధికారి భవానీహర్ష, ఏపీడీ లలితకుమారి పరిశీలించారు. ఓబులక్కపల్లిలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. అయితే ఇంత మంది జిల్లా అధికారులు రెండు గ్రామాలకు వస్తున్న విషయాన్ని ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, ఏపీఓ ఎవరూ కూడా సర్పంచ్‌లకు తెలియజేయలేదు. ఓబులక్కపల్లి, అక్కచెరువు సర్పంచ్‌లు ఆవుల వెంకట సుబ్బారెడ్డి, చేరెడ్డి నాగలక్ష్మి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కావడం వల్లే వారికి సమాచారం ఇవ్వకుండా కూటమి నేతలు ఒత్తిడి చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఓబులక్కపల్లిలో ఉపాధి హామీపై ప్రజలతో మూఖముఖికి స్పందన కరువైంది. కేవలం ఐదుగురు గ్రామస్తులే ముఖాముఖికి హాజరుకావడంతో మొక్కుబడి తంతుగా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment