పార్టీని వీడడమంటే కన్న తల్లిని మార్చడమే
సింగరాయకొండ: ౖవెఎస్సార్‌సీపీ గుర్తు పై గెలిచి పదవులు అనుభవించి స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారడమంటే కన్నతల్లిని మార్చటమేనని ఇటీవల పార్టీ మారిన వారిపై వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరుగుమల్లి మండలానికి సంబంధించి పార్టీ నూతన కమిటీల నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ మండల పార్టీలో బలమైన నాయకత్వ నిర్మాణమే ధ్యేయంగా కృషి చేస్తానని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కొండపి గడ్డ పై పార్టీ జెండా ఎగురవేయటమే తన కర్తవ్యమని, ఆ ప్రకారం నూతన కమిటీలను నియమిస్తామని వివరించారు. కార్యకర్తలే పార్టీకి బలం, పునాది అని పునరుద్ఘాటించారు. కార్యకర్తల సమస్యలను అర్థం చేసుకున్న వాడే నాయకుడిగా ఎదుగుతాడన్నారు. పార్టీకి ప్రజాబలం బాగా ఉందని, కూటమి ప్రభుత్వం పై ఆరునెలలకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి 2047 విజన్‌ను తెరపైకి తెచ్చారని ఈ విజన్ అమలు కావటానికి ఇంకా 23 సంవత్సరాల సమయం ఉందని అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా కూటమి నాయకులు డైవర్షన్ రాజకీయాలు మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని హితవుపలికారు. రైతుభరోసా పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవ పేరు పెట్టారని, కానీ పథకం కింద ఇస్తానన్న రూ.20 వేలు మాత్రం ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలైనా ఒక్క హామీ నెరవేరలేదని మహిళలు, రైతులు, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈనెల 27వ తేదీ విద్యుత్ చార్జీల పెంపుపై, జనవరి 3వ తేదీ విద్యార్థులకు బాసటగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు.
వలంటీర్ వ్యవస్థ లేదు కానీ ఆ శాఖకు మంత్రి ఉన్నాడు:
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గ్రామ వలంటీర్లుకు జీతం రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ నేడు ఆ వ్యవస్థే లేదని సాక్షాత్తు అసెంబ్లీలో మంత్రి స్వామి ప్రకటించారని ఆదిమూలపు సురేష్ విమర్శించారు. వలంటీర్ వ్యవస్థ లేకపోతే లేని వ్యవస్థకు స్వామి మంత్రిగా ఎలాఉన్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులు జగన్‌మోహన్‌రెడ్డిని అసెంబ్లీకి పిలిపించి తిట్టి పైశాచిక ఆనందం పొందేందుకు ఆరాటపడుతున్నారని, జగన్‌ను అవమానించటమే వారి లక్ష్యమని విమర్శించారు. గతంలో హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇవ్వకుండా అతనే రాజీనామా చేసేలా చంద్రబాబు చక్రం తిప్పారని, త్వరలో జనసేన నాయకుడు నాగబాబు విషయంలోఅదే పునరావృతం అయినా ఆశ్చర్యం లేదన్నారు. నీచ రాజకీయాలు చేయటంలో చంద్రబాబును మించిన వారు లేరని మాజీ మంత్రి సురేష్ ఘాటుగా విమర్శించారు. ఈ సందర్బంగా పార్టీ పదవులు ఆశించే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మండలంలోని అన్ని గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వలంటీర్ వ్యవస్థ లేదు కానీ ఆ శాఖకు మంత్రి ఉన్నాడు మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
Comments
Please login to add a commentAdd a comment