కొండ వద్ద మట్టి తవ్వుతున్న పొక్లెయిన్ ను అడ్డుకుంటున్న మహిళలు
మట్టి కోసం కొర్రపాటివారిపాలెం కొండను తవ్వేసిన పచ్చమూక
కోట్ల రూపాయల విలువైన కొండమట్టి తరలింపు
టీడీపీ నేత ధనదాహంతోనే అక్రమ తవ్వకాలని గ్రామస్తుల మండిపాటు
అక్రమ మట్టి రవాణా నిలిపేయాలని ధర్నా
మీ ధన దాహంతో మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన
తాళ్లూరు: ఆ గ్రామస్తులకు ఆ ఊరిలో ఉన్న కొండే జీవనాధారం. 40 ఏళ్లుగా ఆ కొండను ఆధారంగా చేసుకుని జీవాలు, గేదెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కొండపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఇంకేముంది కొండను పిండిచేసి మట్టి తరలించేశారు. తాళ్లూరు మంలం కొర్రపాటివారిపాలెంలో ఉన్న మట్టి కొండను ఆరు నెలల్లోనే మొత్తం తవ్వి నేల మట్టం చేస్తున్నారు. గ్రామస్తులు తమ జీవనాధారం పోతుందని కాళ్లా వేళ్లాపడి వాపోయినా వినలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా అడ్డుకోలేదు.
ఎవరైనా అడ్డుకున్న వారి ఇంటికి నేరుగా పోలీసులనే పంపి వారి అంతు చూస్తామని బెదిరించి మట్టిని తరలించుకుని పోయారు. కొండవద్దకు వెళ్లి ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకోవాల్సిన పోలీసులు అవినీతి పరులకు అండగా నిలిచారు. రెవెన్యూ యంత్రాంగానికి ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోకుండా వదిలేశారు. అద్దంకి నియోజకవర్గం మోదేపల్లి గ్రామానికి–దర్శి నియోజకవర్గం కొర్రపాటివారిపాలెంకు మధ్యలో ఈ కొండ ఉంది. దీంతో రెండు నియోజకవర్గాల అధికారులు మా పరిధిలో కాదంటే మా పరిధిలో లేదని చెప్పుకుంటున్నారు.
కొండమట్టిని ఎటువంటి అనుమతులు లేకుండానే తోలుకుంటున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్న సామెతగా నియోజకవర్గ టీడీపీ నేత పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకుని కొండ మట్టి తోలుకోవడానికి అనుమతిస్తే గ్రామ, మండల స్థాయి టీడీపీ నాయకులు తమకు కూడా వాటాలు కావాలని తోలుకునే వారి వద్ద వసూళ్లు మొదలెట్టారు. దీంతో ఈ విషయం కాస్త రచ్చ రచ్చ అయింది. ప్రస్తుతం గ్రామస్తుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది.
గ్రామంలో జీవాలు మేపుకునేందుకు ఎటు వెళ్లాలో తెలియక తమ జీవాలకు మేత ఎలా చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో కొర్రపాటివారిపాలెం గ్రామస్తులు కొట్టుమిట్టాడుతున్నారు. చావో బతుకో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిలో సహనం నశించి గ్రామస్తులందరూ కలసి కట్టుగా అక్రమార్కుల పై తిరగబడ్డారు. మంగళవారం పొక్లెయిన్‌లు, లారీలను నిలిపేసి ధర్నాకు కూర్చున్నారు. మా పైనించి వాహనాలు తీసుకుని వెళ్లి మా ప్రాణాలు తీసి ఇక్కడ నుంచి మట్టి తీసుకుని వెళ్లాలని భీష్మించుకుని కూర్చున్నారు. టీడీపీ నియోజకవర్గ నేత ధనదాహం తో తమ కొండ మట్టి మొత్తం తరలించుకుని పోతోందని తాము అడ్డు వస్తే పోలీసులను ఇంటికి పంపి బెదిరింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment