కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలి
ఒంగోలు సిటీ: పల్లెల్లో ప్రశాంత వాతావరణం ఉండాలే కానీ ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేయకూడదని ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. మంగళవారం దేవరంపాడు గ్రామానికి చెందిన కనుమూరి నాగేశ్వరరావు కు చెందిన పొగనారు మడుల వద్ద వేసిన రెండు పాకలను కొందరు దుండగులు ఆదివారం అర్ధరాత్రి తగులబెట్టారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతాన్ని చుండూరు రవిబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చుండూరు రవిబాబు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చిన వెంటనే ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకపోవడమే కాకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పరిపాలనను గాలికొదిలేసి ప్రతిపక్ష పార్టీని ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారిని బెదిరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కూడా కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఆర్ధికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాననే ధైర్యాన్ని కార్యకర్తలకు ఇచ్చారు.
ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, దాడులతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కరవది ఎంపీటీసీ మన్నె శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు చుంచు రామకృష్ణ, నాయకులు కనుమూరి నాగరాజు, కనుమూరి రమేష్, కనుమూరి వెంకట రమణయ్య, కోటేశ్వరరావు, కె.బాలాంజనేయులు, కె.శ్రీను, కె.రవిబాబు, అయ్యపురెడ్డి, పులుసు సురేష్‌బాబు, కె.అంకయ్య, కోకు నాగరాజు,కె.సాయి ఉన్నారు.
ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు
Comments
Please login to add a commentAdd a comment