జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
● సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు
ఒంగోలు టౌన్: జిల్లా అభివృద్ధిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు విమర్శించారు. మంగళవారం ఒంగోలులోని సుందరయ్య భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చీమకుర్తి మహాసభల తీర్మానాలను వివరించారు.సీపీఎం సుదీర్ఘ పోరాటాలతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాను వెనక బడినదిగా గుర్తించినప్పటికీ అందుకు తగిన విధంగా నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు అవసరం కాగా కనీసం రూ.50 కోట్లు కూడా కేటాయించలేదన్నారు. జిల్లాలోని నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, కొత్త పరిశ్రమలొస్తే నిరుద్యోగ సమస్య కొంత మేర తీరుతుందన్నారు. కొత్తగా మరిన్ని ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లు ఖర్చు పెట్టారని, ఇంకా రూ.4 వేల కోట్లు విడుదల చేయడంతోపాటు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై భారం వేయడం సరికాదని, విద్యుత్ సర్దుబాటు పేరుతో కూటమి ప్రభుత్వం మరో రూ.9500 కోట్లు వసూలు చేసేందుకు సిద్ధం కావడం దారుణమన్నారు. విద్యుత్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు వేస్తున్న ఎత్తులను ప్రజలతో కలిసి తిప్పికొడతామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌డీ హనీఫ్ మాట్లాడుతూ.. సమస్యలపై పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అబివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని పార్టీ నేతల జీవీ కొండారెడ్డి విమర్శించారు. అంకెల గారడీతో ప్రజలను మభ్య పెట్టి మాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో జిల్లా నాయకులు కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment