ఆహ్వానపత్రికను చూపుతున్న రవిచంద్ర, రమేష్, చంద్రశేఖర్‌రెడ్డి
మార్కాపురం: ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 5, 6, 7వ తేదీల్లో రాజమహేంద్రవరంలోని గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు పండిత పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రవిచంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు జీఎల్ రమేష్‌బాబు మంగళవారం తెలిపారు. మార్కాపురంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు భాషాభిమాని, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ ఎస్‌ఎన్ రాజు సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆదికవి నన్నయ్య వేదికపై తెలుగు భాషలోని 25 ప్రక్రియలపై సదస్సులు, కవిసమ్మేళనంలో కవిత, గేయం, పద్యం, హైకూ, నానీలు, తెలుగు గజల్, తెలుగు రుబాయి, కథా పఠనాలకు అవకాశం కల్పిస్తున్నామని, నూతన గ్రంథావిష్కరణలకు స్వాగతం పలుకుతున్నామన్నారు. ఇంకా హరికథ, బుర్రకథ, యక్షగానం, అవధానం, పౌరాణిక, సాంఘీక నాటకాలు, వాగ్గేయకార, జానపద సంగీతం, ఆంధ్రనాట్యం, కూచిపూడి నృత్యాలు ఉంటాయన్నారు. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులకు రాజరాజ నరేంద్ర ప్రతిభా పురస్కారాలు అందింయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత వయోజన విద్య ఉప సంచాలకులు అన్నపురెడ్డి వీరారెడ్డి, హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, వేణుగోపాల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment