వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటేశ్వరనాయక్
● 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
మార్కాపురం: మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామంలో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి మీనిగ వెంకటేశ్వర్లును హత్య చేసిన నిందితుడిని బుధవారం మార్కాపురంలో అరెస్టు చేసినట్లు సీఐ ఆవుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో హత్య కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. నికరంపల్లి గ్రామానికి చెందిన మారంరెడ్డి కాశీరామిరెడ్డి అదే గ్రామానికి చెందిన మీనిగ వెంకటేశ్వర్లు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లును అడ్డు తొలగించాలని పథకం రచించాడు. ఈనెల 19న అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో తన ఇంటి వరండాలో నిద్రిస్తున్న వెంకటేశ్వర్లును కాశీరామిరెడ్డి గొడ్డలితో నరికి చంపి పారిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. బుధవారం మార్కాపురం శివార్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాశీరామిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడు కాశీరామిరెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. సమావేశంలో రూరల్ ఎస్సై వెంకటేశ్వరనాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment