మార్కాపురం మీదుగా శబరికి ప్రత్యేక రైలు
మార్కాపురం: మచిలీపట్నం నుంచి కొల్లాం వెళ్లే శబరిమల రైలు మార్కాపురం రోడ్ స్టేషన్‌మీదుగా ప్రయాణిస్తుందని, అయ్యప్ప మాలధారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గుంటూరు డీఆర్‌యూసీసీ మెంబర్ ఆర్‌కేజే నరసింహం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం–కొల్లాం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు(07147) డిసెంబర్ 23, 30వ తేదీల్లో మచిలీపట్నం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.58 గంటలకు మార్కాపురం రోడ్ రైల్వేస్టేషన్ చేరుతుందన్నారు. మార్కాపురం నుంచి 6 గంటలకు బయలుదేరి నంద్యాల, రేణిగుంట, కోయంబత్తూర్, ఎర్నాకుళం టౌన్ మీదుగా మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లాం చేరుతుందని వివరించారు. కొల్లాం–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు(07148) డిసెంబర్ 25, జనవరి 1వ తేదీన కొల్లాం నుంచి తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. 22 అధునాతన బోగీలతో ఈ రైలును ఏర్పాటు చేశారని, ఏసీ సౌకర్యం కూడా ఉందని తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
దర్శి: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తూర్పు వీరాయపాలెం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గంధం యోహాను (33) మోటారు సైకిల్‌పై దర్శి నుంచి బొట్లపాలెం వెళుతున్నాడు. ఈ క్రమంలో మోటారుసైకిల్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి కిందపడ్డాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యోహను మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మల్లెతోటలో చోరీ
● రూ.లక్ష నగదు, 12 గ్రాముల బంగారం అపహరణ
సింగరాయకొండ: ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో చోరీకి పాల్పడి రూ.లక్ష నగదు, 12 గ్రాముల బంగారాన్ని అపహరించారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున మండల కేంద్రంలోని మల్లెతోట–4వ లైన్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ మహమ్మద్ రఫీ, ఇమాంబీలు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు బ్యారన్ల ఇనుప గొట్టాలు అమ్మే వ్యాపారం చేస్తుంటారు. వ్యాపార నిమిత్తం ఎక్కువ శాతం అక్కడే ఉంటారు. అప్పుడప్పుడు ఇక్కడకి వచ్చి వెళుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఇంటికి వచ్చిన రఫీ, ఇమాంబీలు అప్పు తీర్చేందుకు నగదు తెచ్చి ఇంట్లో ఉంచామని, సోమవారం ఊరెళ్లామని తిరిగి వచ్చేలోగా చోరీ జరిగిందని వాపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది.
డెంగీతో మహిళ మృతి
పీసీపల్లి: మండల పరిధిలోని గోపవరపువారిపల్లికి చెందిన మూలే కామేశ్వరి (24) మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందింది. ఈమె డెంగీ లక్షణాలతో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ఈమెకు భర్త రమణారెడ్డి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయలేదు. దీంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో బ్లీచింగ్, దోమలు నివారణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment