గ్రావెల్ తరలించేందుకు ఎన్‌ఎస్పీ కెనాల్ పూడ్చి మరీ రోడ
మద్దిపాడు: ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాకే తలమానికమైన గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు, చుట్టుపక్కల గ్రామాలు, పొలాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్ వద్ద గ్రావెల్ తవ్వకాలకు ఓ రోడ్డు నిర్మాణ సంస్థకు అడ్డదిడ్డంగా అధికారులు అనుమతులివ్వడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఇచ్చిన అనుమతులకు మించి.. ఏకంగా గుండ్లకమ్మ ప్రాజెక్టుకే ప్రమాదం వాటిల్లేలా ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకునేంత వరకూ అధికారులు మొద్దునిద్రలో ఉండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఒకరిపై మరొకరు చెప్పుకోవడంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్ల మత్తు కారణంగానే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని రిజర్వాయర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు.
2 జేసీబీలు, 50కిపైగా టిప్పర్లతో వేల టన్నుల గ్రావెల్ తరలింపు...
విజయవాడ నుంచి బెంగళూరుకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను ఏజీఎస్ కన్‌స్ట్రక్షన్ సంస్థ చేస్తోంది. ఈ రోడ్డు నిర్మాణానికి భారీగా మట్టి, గ్రావెల్ అవసరం కాగా, గుండ్లకమ్మ డ్యాంలోని ఫుల్ రిజర్వింగ్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) లోపలివైపు మట్టి తవ్వి తరలించుకునేందుకు ఇరిగేషన్ ఎస్‌ఈ అనుమతులిచ్చినట్లు తెలుస్తుంది రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు దోహదపడుతుందనే ఉద్దేశంతో అనుమతులిచ్చినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కానీ, మద్దిపాడు మండల పరిధిలోని పాత గార్లపాడు, దొడ్డవరం రెవెన్యూ పరిధిలో ఉన్న పెయ్యాలతిప్ప కొండను తవ్వి అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్నారు. రెండు పెద్ద జేసీబీలతో తవ్వకాలు జరిపి 50కిపైగా టిప్పర్ల ద్వారా వేల టన్నుల గ్రావెల్‌ను మాయం చేస్తున్నారు. జలాశయ నిర్మాణ సమయంలో ఇరిగేషన్ అధికారులు పెయ్యాలతిప్పపై ఎఫ్‌ఆర్‌ఎల్‌కు కొన్ని మీటర్ల దూరం వరకు హద్దురాళ్లు ఏర్పాటు చేసి తవ్వకాలు నిషేధించారు. కానీ, ఏజీఎస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వారు ఎఫ్‌ఆర్‌ఎల్ రాళ్లను సైతం పెకిలించి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు.
కరకట్టకు బలం తగ్గి
గ్రామాలు మునిగే ప్రమాదం...
గుండ్లకమ్మ జలాశయం కుడి కరకట్టకు దన్నుగా నిలిచిన పెయ్యాలతిప్ప కొండను ఆనుకుని జలాశయం లోపల వైపున్న గ్రావెల్ తవ్వుకోవడానికి ఇరిగేషన్ ఎస్‌ఈ అనుమతివ్వడంతో ఏజీఎస్ కన్‌స్ట్రక్షన్స్ వారు గ్రావెల్ తవ్వకాలు మొదలుపెట్టారు. కానీ, పెయ్యాలతిప్ప కొండను బయటవైపు (ఎఫ్‌ఆర్‌ఎల్ వెలుపల) కూడా తవ్వి గ్రావెల్ తరలిస్తుండటంతో జలాశయానికి కుడివైపు ఉన్న కరకట్టకు బలం తగ్గి జలాశయంలోని నీరు బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది. గతంలోనే పెయ్యాల తిప్ప నుంచి చుట్టుపక్కల గ్రామాల వారు గ్రావెల్ తరలించుకుపోయారు. గుండ్లకమ్మ జలాశయం నిర్మాణం తర్వాత ఆ ప్రాంతంలో గ్రావెల్, మట్టి తరలించడాన్ని నిషేధించారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు సైతం వారి అవసరాలకు గ్రావెల్, మట్టిని ఇతర ప్రాంతాల నుంచి సరఫరా చేసుకుంటున్నారు. ప్రస్తుతం నిషేధిత ప్రాంతంలోనే గ్రావెల్ తవ్వి తరలిస్తుండటంపై సమీప గ్రామాల ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తవ్వకాలను అడ్డుకున్న
దొడ్డవరం గ్రామస్తులు...
ప్రమాదకరస్థాయిలో గ్రావెల్ తవ్వి తరలిస్తుండటంతో దొడ్డవరం గ్రామస్తులు గత బుధవారం టిప్పర్లను అడ్డుకున్నారు. హద్దులు నిర్ణయించకుండా జలాశయం అధికారులు గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఎలా ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్థానిక తహసీల్దార్ కూడా వెళ్లి తవ్వకాలను పరిశీలించి నిలిపివేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తానని తెలిపారు. అయితే, అక్రమంగా తవ్వకాలు చేస్తున్న ప్రాంతం ఇరిగేషన్‌తో పాటు రెవెన్యూ పరిధిలో కూడా ఉన్నప్పటికీ.. గ్రామస్తులు ఆందోళన చేసేంత వరకూ సంబంధిత అధికారులకు తెలియకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గుండ్లకమ్మ జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకే గ్రావెల్ తవ్వకాలకు అనుమతులిచ్చినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నప్పటికీ.. రెవెన్యూ పరిధిలో కూడా అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ.. ఈ గ్రావెల్ తవ్వకాల వలన జలాశయం కుడి కరకట్ట బలహీనమై గండి పడే ప్రమాదం ఉందంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రైతుల పంట భూములకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ వారు ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ రిజర్వాయర్‌ను నిలువునా ముంచేలా ఉన్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను కాపాడాలని, చుట్టుపక్కల గ్రామాలకు, పొలాలకు రక్షణ కల్పించాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
అక్రమంగా గ్రావెల్ తవ్వకాలతో కనుమరుగైపోతున్న పెయ్యాలతిప్పకొండ
గుండ్లకమ్మ డ్యాం వద్ద ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు
విజయవాడ – బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భారీగా తరలింపు
ఇరిగేషన్ ఎస్‌ఈ అనుమతులు ఉన్నాయంటున్న నిర్వాహకులు
ఎఫ్‌ఆర్‌ఎల్ లోపలే అనుమతులిచ్చినట్లు చెబుతున్న ఇరిగేషన్ అధికారులు
ఎఫ్‌ఆర్‌ఎల్ వెలుపల కూడా తవ్వడంతో గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు ముప్పు
ఒకరిపై మరొకరు చెప్పుకుంటున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
గుండ్లకమ్మ డ్యాం వద్ద అక్రమంగా తవ్విన గ్రావెల్‌ను టిప్పర్ల ద్వారా తరలించేందుకు ఎన్‌ఎస్పీ కెనాల్‌ను కొంతమేర పూడ్చి మరీ గ్రావెల్ రోడ్డును ఏజీఎస్ కన్‌స్ట్రక్షన్ సంస్థ నిర్మించింది. దీని గురించి కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అద్దంకి మండలంలోని ధేనువకొండ ఆర్‌అండ్‌బీ రోడ్డు మీదుగా వెళ్తూ మధ్యలో ఉన్న ఎన్‌ఎస్పీ కెనాల్ గట్టుపై గ్రావెల్‌తో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర 15 అడుగుల వెడల్పుతో గ్రావెల్ రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును దొడ్డవరం నుంచి పాత గార్లపాడు వెళ్లే డొంక రోడ్డుకు లింకు చేసుకుని మార్గం మధ్యలో ఉన్న చెరువు కట్టపై 45 అడుగుల వెడల్పు కలిగిన గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్‌ఎస్పీ కాలువ గట్టు ఆక్రమించి రోడ్డు నిర్మించినా.. చెరువు కట్టపై 45 అడుగుల వెడల్పుతో గ్రావెల్ రోడ్డు నిర్మించినా.. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో వేసిన చెట్లకు ఇబ్బంది కలుగుతున్నా.. సంబంధిత అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment