జీఎస్‌డీపీ వృద్ధి రేటే లక్ష్యంగా కృషి చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా 15 శాతం జీఎస్‌డీపీ వృద్ధిరేటు లక్ష్యంతో వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. గ్రీవెన్స్ హాలులో శుక్రవారం వ్యవసాయ అనుంబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే మూడు నెలల స్థిర లక్ష్యాలను సాధించేందుకు శాఖల ఆధ్వర్యంలో మండలాలు, డివిజనల్ వారీగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో అగ్రి డిప్ టెక్నాలజీ వినియోగంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు మేలు జరిగేలా తగిన సలహాలు, సూచనలు స్వీకరించి కౌలు రైతు చట్టం అమలు చేయాలన్నారు. డ్రోన్ టెక్నాలజీపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు పంట బీమా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షిస్తూ జిల్లాలో చేపట్టిన 21వ పశు గణన కార్యక్రమాన్ని 2025 జనవరి నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. మంజూరైన మినీ గోకులం షెడ్లను డ్వామా శాఖతో సమన్వయం చేసుకుని సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 1200 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేలా లక్ష్యం కాగా 748.26 ఎకరాల్లో ఇప్పటి వరకు పశుగ్రాసం పెంచినట్లు తెలిపారు. మత్స్యశాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై మాట్లాడుతూ నిర్దేశించిన వృద్ధి రేటు సాధించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్టు కింద మత్స్యకారులందరినీ రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యానవన శాఖ అధికారులు ఉద్యాన పంటల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సూక్ష్మ సేద్యాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. దీనిలో వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ బేబిరాణి, హార్టీకల్చర్ అధికారి గోపిచంద్, ఏపీ ఎంఐపీ పీడీ రమణ, సహకార శాఖ అధికారి శ్రీనివాసులరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment