క్రీడలతో మానసిక ఉల్లాసం
● రాష్ట్రా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
సింగరాయకొండ: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మండలంలోని పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ రాష్ట్రస్థాయి అండర్ 14,17,19 బాల బాలికల స్కూల్ గేమ్స్ ఎంపికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. క్రీడాభివృద్ధిలో భాగంగా అమరావతిలో స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖలో ఆగిన స్పోర్ట్స్ మీట్‌ను తిరిగి ప్రారంభిస్తామని, దీనికి రూ.కోటి మంజూరు చేశారన్నారు. సింగరాయకొండలో రూ.95 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామన్నారు. దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో విశాఖపట్నంలో రూ.200 కోట్లతో నిర్మాణానికి అనుమతులు మంజూరైనట్లు పేర్కొన్నారు. పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి స్వామి క్రీడా జ్యోతిని వెలిగించి క్యారమ్స్ పోటీలకు రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. సర్పంచ్ ఎస్ చంద్రశేఖర్, రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ గేమ్స్ పరిశీలకుడు స్వర్ణరాజు, జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి ఎండీ హజీరాబేగం, ఎంఈఓ శ్రీనివాసరావు, సీఐ సీహెచ్ హజరత్తయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment