రెడ్‌క్రాస్‌నూ వదలని పచ్చ రాజకీయం
ఒంగోలు టౌన్: విశ్వసనీయతకు..నిస్పక్షపాత సేవలకు మరోపేరు రెడ్‌క్రాస్. ఆపత్కాలంలో ఆదుకునే ఆత్మబంధువు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఎంతో మంది బాధితులకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ పేరు వింటే చాలు ఎలాంటి వారైనా సరే గౌరవిస్తారు. అలాంటి రెడ్‌క్రాస్‌లో పచ్చ రాజకీయం జోక్యం చేసుకోవడం జిల్లాలో తీవ్ర విమర్శకు దారి తీసింది. పక్కా ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేసే రెడ్ క్రాస్ నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికార పార్టీకి అండగా నిలిచే వారి అవగాహన లోపంతో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెడ్‌క్రాస్‌లో ఆధిపత్యం చెలాయించేందుకు కుట్రలు చేసి భంగపడ్డారు. రెడ్‌క్రాస్ కమిటీ చేత రాజీనామా చేయించి టీడీపీకి చెందిన వారిని నియమించేందుకు చేసిన కుయుక్తులు న్యాయస్థానం తీర్పుతో మూలనపడ్డాయి.
ఇంతకూ ఏం జరిగిందంటే...
ఒంగోలు రెడ్‌క్రాస్‌కు 2020లో పాలకవర్గ ఎన్నికలు జరిగాయి. చైర్మన్‌గా విద్యావేత్త ప్రకాష్ బాబు, వైస్ చైర్మన్‌గా డాక్టర్ చిట్యాల వెంటేశ్వరరెడ్డి, కోశాధికారిగా రాఘవతో పాటు మరో 13 సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడేళ్ల తరువాత పాలక వర్గం కాలపరిమితి అయిపోవడంతో తిరిగి 2023 మార్చిలో అదే కమిటీని ఎన్నుకున్నారు. ఈసారి 14 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కమిటీకి 2026 వరకు సమయం ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో కమిటీని మార్చాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుత కమిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నికై ంది కనుక ఇందులో పనిచేసే వారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే అనే ముద్ర వేసిన కొందరు పచ్చ మేధావులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు తప్పుడు సమచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కమిటీ చైర్మన్ రాజీనామా చేస్తే మొత్తం కమిటీ రద్దవుతుందని, అప్పుడు మనవాళ్లను నియమించుకోవచ్చని సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. తద్వారా కమిటీ చేత రాజీనామా చేయించేందుకు తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక చైర్మన్ ప్రకాష్ బాబుతో సహా 8 మంది సభ్యులు అక్టోబర్ 17వ తేదీ కలెక్టర్‌కు రాజీనామా సమర్పించారు. మరో ఐదుగరు మాత్రం రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు. ఆ ఐదుగురు కలిసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. దాంతో డాక్టర్ చిట్యాల వెంకటేశ్వరరెడ్డి చైర్మన్ అయ్యారు.
రెడ్ క్రాస్ కమిటీ ఎన్నికలపై హైకోర్టు స్టే...
కమిటీలోని 8 మంది రాజీనామాలను ఆమోదించిన రెడ్‌క్రాస్ ప్రెసిడెంట్ అయిన కలెక్టర్ తమీమ్ అన్సారియా స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. డిసెంబర్ 22వ తేదీ రెడ్‌క్రాస్ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులు చెల్లవంటూ చైర్మన్‌గా ఎంపికై నా చిట్యాల వెంకటేశ్వరరెడ్డి కోర్టుకు వెళ్లారు. కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో 8 మంది రాజీనామాలు కూడా రద్దయ్యాయి. పాత కమిటీ కొనసాగినట్లేనని చెప్పవచ్చు.
ఈ ఒత్తిళ్ల వెనక ఉన్నదెవరు?
ఈ పరిణామాలు అధికారపార్టీకి చెంపపట్టు అని చెప్పవచ్చు. అయితే ఈ రాజకీయాల వెనక ఉన్నదెవరన్న దానిమీద పలు చర్చలు జరుగుతున్నాయి. జీజీహెచ్‌లో పనిచేస్తున్న ఒక హెచ్‌ఓడీ ఈ కథంతా నడిపినట్లు తెలుస్తోంది. రెడ్‌క్రాస్‌లో ఉన్న డా.చిట్యాల వెంకటేశ్వరరెడ్డితో ఉన్న వ్యక్తిగత స్పర్ధలతో రెడ్‌క్రాస్ కమిటీకి పొగపెట్టాలని, తద్వారా చిట్యాలను దెబ్బ తీయాలని ఆయన పథకం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలను ఎమ్మెల్యే దామచర్ల దగ్గర దాచివుంచి ఆయనను తప్పుదోవ పట్టించినట్లు జీజీహెచ్‌కి చెందిన పలువురు వైద్యులు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా రెడ్‌క్రాస్ నిబంధనలపై అవగాహనలేని సదరు హెచ్‌వోడీ ఎన్నికలతో నిమిత్తం లేకుండా 14 మంది పేర్లను తయారు చేసి దామచర్లకు ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తీరా హైకోర్టు తీర్పు వచ్చాక అసలు నిజం తెలిసిన ఎమ్మెల్యే దామచర్ల సదరు హెచ్‌ఓడీ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
రాజకీయాలకతీతంగా సేవలు...
రెడ్‌క్రాస్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఒంగోలు రెడ్‌క్రాస్‌లో అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన సానుభూతిపరులున్నారు. వీరంతా ఏ పార్టీకి చెందిన వారైనా నాలుగేళ్లపాటు రాజకీయాలకతీతంగా సేవలందించారు. ఒంగోలు రెడ్‌క్రాస్‌ను రాష్ట్రంలోనే అగ్రపథంలో నిలిపారు. కరోనా సమయంలో ఈ కమిటీ అందించిన సేవలు ప్రశంసలందుకున్నాయి. అయినా ఈ కమిటీ మీద రాజకీయాల ముద్ర వేయడంపై వైద్య వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పాలకవర్గాన్ని సొంతం చేసుకునేందుకు టీడీపీ నేతల కుయుక్తులు హైకోర్టు తీర్పుతో భంగపాటు
Comments
Please login to add a commentAdd a comment