పాలేరును తోడేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

పాలేరును తోడేస్తున్నారు

Published Mon, Dec 23 2024 1:42 AM | Last Updated on Mon, Dec 23 2024 2:02 AM

పాలేర

పాలేరును తోడేస్తున్నారు

ఇసుక మాఫియా పది అడుగులకు పైగా ఇసుకను తవ్వడంతో బయటపడిన నీళ్లు

పొన్నలూరు: గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు సలాం కొడుతూ వారు చెప్పిందే వేదంగా గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలకు, అవినీతి పనులకు కొమ్ముకాస్తున్నారు. పొన్నలూరు మండలం వేంపాడు గ్రామానికి సమీపంలోని పాలేరులో నాలుగు నెలలుగా అనధికారికంగా ఉచిత ఇసుక పేరుతో వేంపాడు, జరుగుమల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకులు టిప్పర్లు, లారీలు, పెద్ద పెద్ద వాహనాలతో ఇసుక తరలిస్తూ అక్రమ ఇసుక దందాకు తెరలేపారు. ఈ దందా అంతా నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బడా నేతల కనుసన్నల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఆ నేతల అండదండలు చూసుకొని స్థానికంగా ఇద్దరు టీడీపీ నేతలు ప్రతి రోజూ పదుల సంఖ్యలో టిప్పర్లు, లారీలు, పెద్ద పెద్ద వాహనాలతో ఇసుక తరలించి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇందులో వచ్చే 80 శాతం వాటాను నియోజకవర్గ బడానేతలకు చేరుతుండగా, మిగిలిన 20 శాతం ఇసుకు దందా పర్యవేక్షకులు మింగేస్తున్నట్లు సమాచారం.

రాజీ కుదిర్చిన మంత్రి స్వామి...

వాస్తవంగా పాలేరు నుంచి స్థానికులు వారి గృహావసరాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసుకెళ్లవచ్చు. అయితే ఇసుక దందా సాగిస్తున్న టీడీపీ నేతల ఆధ్వర్యంలో పాలేరులో రెండు పొక్లెయిన్‌లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి రోజు ఇసుక కోసం పాలేరుకు వచ్చే వినియోగదారుడు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన పొక్లెయిన్‌ దగ్గర మాత్రమే ట్రక్కుకు రూ.1000 చెల్లించి ఇసుక నింపించుకోవాలి. లేకపోతే ఇసుకను తీసుకెళ్లనివ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ క్రమంలో వారం రోజుల కిందట పొన్నలూరు వచ్చిన మంత్రి స్వామిని టీడీపీ సానుభూతిపరులే ఈ విషయంపై నిలదీశారు. కూలీలతో ట్రాక్టర్‌కు ఇసుక నింపిస్తే రూ.500 మాత్రమేనని, కానీ కొందరూ మన పార్టీ వారే మాఫియాగా ఏర్పడి... వారు ఏర్పాటు చేసిన పొక్లెయిన్ల ద్వారానే ఇసుక నింపించుకోవాలని అందుకు రూ.1000 వసూలు చేస్తున్నారని మంత్రి స్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఖంగుతిన్న మంత్రి స్థానిక ఎస్సైని పిలిచి ఈ విషయాన్ని రాజీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈక్రమంలో ఎస్సై పాలేరులో పొక్లెయిన్లు ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్న వ్యక్తులకు, టీడీపీ సానుభూతి పరులైన ట్రాక్టర్‌ యజమానులకు మధ్య రాజీ కుదుర్చి రూ.500 లకే ఇసుకను నింపేలా మాట్లాడినట్లు ట్రాక్టర్‌ యజమానులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. మొత్తంగా అక్రమ ఇసుక రవాణాల్లో పోలీసులు తీరు వివాదాస్పదంగా ఉందని వేంపాడు గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు.

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు...

ఇదిఇలా ఉంటే ఆదివారం తెల్లవారుజామున మళ్లీ అక్రమార్కులు టిప్పర్లు, లారీలతో ఇసుక తరలించడం గమనించిన గ్రామస్తులు మైనింగ్‌ అధికారుల సూచనలు మేరకు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు గ్రామస్తులు, అక్రమార్కులకు మధ్య గొడవ జరిగింది. ఎంతసేపైనా టిప్పర్లు, లారీలను గ్రామస్తులు ముందుకు పోనివ్వకపోవడంతో బడా నేతల ఆదేశాల మేరకు పొన్నలూరు పోలీసులు రంగప్రవేశం చేశారు.

పాలేరులో ఆగని టీడీపీ నేతల అక్రమ ఇసుక రవాణా వేంపాడు సమీపంలోని పాలేరును సందర్శించిన మైనింగ్‌ అధికారులు మైనింగ్‌ అధికారుల సూచనలతో టిప్పర్లు, లారీలను అడ్డుకున్న గ్రామస్తులు బడా నేతల ఆదేశాలతో రంగంలోకి దిగిన పొన్నలూరు పోలీసులు అక్రమ ఇసుకను అడ్డుకుంటే కేసులు పెడతామంటూ బెదిరింపులు టిప్పర్లు, లారీలను అడ్డుకున్న గ్రామస్తులను పోలీస్‌స్టేషన్‌కు రావాలని హుకుం

పాలేరును సందర్శించిన మైనింగ్‌ అధికారులు...

అక్రమ ఇసుక రవాణాపై ‘సాక్షి’ పత్రికలో కథనాలు రావడంతో పాటు పాలేరు నదీ పరివాహక గ్రామాల ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో మార్కాపురం మైనింగ్‌ అధికారులు వేంపాడు సమీపంలోని పాలేరును శనివారం సందర్శించారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న అక్రమార్కులు ఆరోజు ఎలాంటి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడకుండా మిన్నకుండిపోయారు. మైనింగ్‌ అధికారులు అక్కడ ఇసుక తరలించడం వలన ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు, టిప్పర్లు, లారీల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన రహదారిని పరిశీలించి ప్రతి రోజూ భారీ స్థాయిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు తెలియజేశారు. అలాగే గ్రామ సర్పంచ్‌ని, గ్రామస్తులను పిలిచి మాట్లాడారు. పాలేరు నుంచి ఇసుక తరలించడానికి ఎలాంటి అనుమతి లేదని, అయితే స్థానికులు తమ గృహ అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లవచ్చని వివరించారు. టిప్పర్లు, లారీలు ద్వారా ఇసుకను తరలిస్తే అడ్డుకొని అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించి వెళ్లిపోయారు.

అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారపార్టీ నాయకులు పాలేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జేసీబీలను ఏర్పాటు చేసి టిప్పర్లు, లారీలతో పక్క మండలాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. మైనింగ్‌ అధికారుల సూచన మేరకు ఇసుక రవాణాను అడ్డుకుంటుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్న వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి.

– దాసరి రవి, వేంపాడు గ్రామం

నిబంధనలు పాటించకపోతే చర్యలు

ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ఇసుక తరలించే విషయంలో గ్రూపులుగా ఏర్పడి గొడవలకు దిగితే కేసులు పెడతామని చెప్పాము తప్పా ఎవరిపై అక్రమంగా కేసులు పెడతామని బెదిరించలేదు. వ్యాపారంగా టిప్పర్లు, లారీలతో ఇసుకను తరలిస్తే చట్ట పరమైన కేసులు పెడతాం. గృహవసరాలకు మాత్రమే స్థానికులు ఇసుకను తీసుకెళ్లవచ్చు. దీనిపై ప్రజలు సహకరించాలి.

– అనుక్‌, ఎస్సై పొన్నలూరు

లారీలను పట్టుకోకుండా వదిలేసిన పోలీసులు...

పాలేరుకు చేరుకున్న పోలీసులు ఇసుక తరలిస్తున్న టిప్పర్లు, లారీలను పట్టుకోకుండా వాటిని వదిలేసి అక్కడ నుంచి పంపించి వేశారు. దీంతో గ్రామస్తులు పోలీసుల తీరుకు విస్తుపోయి నిరసనకు దిగారు. అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రిప్పర్లను, లారీలను అడ్డుకుంటే మీ మీదా కేసులు పెడతామని.. లారీలను అడ్డుకోకుండా ఇక్కడ నుంచి వెళ్లిపోండంటూ పోలీసులు గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని సీఐ, ఎస్సై పోలీస్‌స్టేషన్‌కు రమ్మన్నారంటూ బెదిరించారు. అయితే మైనింగ్‌ అధికారులు చెప్పారని అక్రమ ఇసుక రవాణాను మీరు ఎలా ప్రోత్సహిస్తారంటూ గ్రామస్తులు పోలీసులను ప్రశ్నించారు. ఇసుక లారీలు, టిప్పర్లను అడ్డుకున్నందుకు సీఐ, ఎస్సై మీ మీద కోపంగా ఉన్నారని అనవసరంగా కేసులు పెట్టుంచుకుంటారని, కేసులు పెట్టకముందే ఇక్కడ నుంచి వెళ్లిపోండంటూ పోలీసులు ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పాలేరును తోడేస్తున్నారు1
1/3

పాలేరును తోడేస్తున్నారు

పాలేరును తోడేస్తున్నారు2
2/3

పాలేరును తోడేస్తున్నారు

పాలేరును తోడేస్తున్నారు3
3/3

పాలేరును తోడేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement