ఉత్తి గ్యాసే
ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు
ఉచితం..
మహిళలకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు ఉత్తి గ్యాసే అని తేలిపోయింది. బాబు మాటలు నమ్మి గ్యాస్ బుక్ చేసుకున్న వారిలో కొంత మందికే సబ్సిడీ డబ్బులు జమచేసి మిగిలిన వారికి మొండిచేయి చూపారు. జిల్లాలో సుమారు 4 లక్షల మంది అర్హులైన వారికి సబ్సిడీ నగదు అకౌంట్లలో జమకాలేదు. ఉచిత గ్యాస్ పేరుతో మమ్మల్ని మోసం చేశారని మహిళలు దుమ్మెత్తి పోస్తున్నారు.
బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు
ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తుందని చెబితే నమ్మి గ్యాస్ బుక్ చేశాను. రోజులు గడుస్తున్నా డబ్బులు మాత్రం బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే మాకు తెలియదు అంటున్నారు. మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయని చెబుతున్నారు. రెండు సార్లు బ్యాంకు దగ్గరకు వెళ్లి అడిగాను. డబ్బులు పడలేదని చెప్పారు. ఇబ్బందులు పెట్టకుండా గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే డబ్బులు పడితే బాగుంటుంది.
– షేక్ మహబూబ్ బాషా, ట్రాక్టర్ డ్రైవర్, కంభం.
ఇంకా డబ్బులు పడలేదు
డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకున్నాను. మరుసటి రోజు గ్యాస్ డబ్బులు బ్యాంకులో పడతాయని చెప్పారు. కానీ ఇంతవరకు పడలేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఎవరిని అడిగినా నాలుగు రోజులు ఆగండి అంటున్నారు. లేకపోతే అధికారులను అడగండి అని చెబుతున్నారు. ఇంతకూ ఏ అధికారిని అడగాలి. ఏ ఆఫీసుకు పోవాలో తెలియడం లేదు.
– సుబ్బులు, మర్రిపూడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మహిళలకు ఉచిత వంట గ్యాస్ పథకం ఆదిలోనే హంసపాదుగా మారింది. దీపావళి పండగ నుంచి గ్యాస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఇప్పటికే రెండు సిలిండర్లు ఇవ్వాలి కానీ నవంబర్ చివరి తేదీ వరకు మొదటి సిలిండర్‌కు డబ్బులు జమ చేస్తామని చెప్పారు. కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే డబ్బులు జమ చేసి చేతులు దులుపుకున్నారు. నవంబర్ చివరి తేదీలోపు గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నా నేటికి 20 రోజులు కావస్తున్నా అతీగతీ లేదు. ఏ రోజుకారోజు సెల్‌ఫోన్‌లో మెసేజ్ వస్తుందేమో అని చూసుకోవడం, చిల్లిగవ్వ కూడా పడకపోవడంతో నిరాశగా కూటమి పాలకులను తిట్టుకుంటున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొంది.
జిల్లాలో 6,56,738 కనెక్షన్లు...
జిల్లాలో మొత్తం 6,56,738 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఇండియన్ గ్యాస్ కంపెనీకి 26 ఏజెన్సీలు ఉన్నాయి. జనరల్ సిలిండర్లు 2,01,758, దీపం 80,876, సీఎస్‌ఆర్ కనెక్షన్లు 13,941, ఉజ్వల కనెక్షన్లు 8156, పీఎంయూవై కనెక్షన్లు 4023, మొత్తం గృహావసరాలకు సంబంధించి 3,08,754 కనెక్షన్లు ఉండగా 1960 వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. హెచ్‌పీ కంపెనీకి సంబంధించి జిల్లాలో 10 ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలో జనరల్ 1,02,458, దీపం కనెక్షన్లు 3,67,76, సీఎస్‌ఆర్ కనెక్షన్లు 1725, ఉజ్వల కనెక్షన్లు 3208, పీఎంయూవై కనెక్షన్లు 1605 మొత్తం మీద 1,45,772 కనెక్షన్లు ఉండగా 1462 వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. భారత్ పెట్రోలియం కంపెనీకి 13 ఏజెన్సీస్ ఉన్నాయి. 1,26,884 జనరల్ కనెక్షన్లు ఉండగా దీపం కనెక్షన్లు 43,974 ఉన్నాయి. సీఎస్‌ఆర్ 22,851 కనెక్షన్లు, ఉజ్వల 5,391 కనెక్షన్లు, పీఎంయూవై 3,112 మొత్తం కలుపుకొని 2,02,212 కనెక్షన్లు ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీకి 10 ఏజెన్సీలు ఉన్నాయి. 1,02,458 జనరల్ కనెక్షన్లు ఉండగా దీపం పథకం కింద 36,776 కననెక్షన్లు, సీఎస్‌ఆర్ కనెక్షన్లు 1725, ఉజ్వల కనెక్షన్లు 3208, పీఎంయూవై కనెక్షన్లు 1605 మొత్తం కలిపి 1,45,772 కనెక్షన్లు ఉన్నాయి. వాణిజ్య కనెక్షన్లు మరో 1462 ఉన్నాయి. ఇదిలా ఉండగా ఒంగోలు నగరంలో ఇండియన్ గ్యాస్‌కు 63,108 కనెక్షన్లు, హెచ్‌పీ గ్యాస్‌కు 53,038 కనెక్షన్లు మొత్తం కలిపి 1,16,146 కనెక్షన్లు ఉన్నాయి.
సగానికి సగం మందికి మొండిచేయి...
జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 6,56,738 ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఏడాదికిగాను కేవలం రూ.20,93,11,842 మాత్రమే మంజూరు చేసింది. ఇప్పటి వరకు సుమారు 2,51,659 మందికి రూ.20,43,45,882 చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్క ప్రకారం చూసినా జిల్లాలో ఇంకా 4,05,079 మందికి ఉచిత సిలిండర్లకు సబ్సిడీని విడుదల చేయాల్సి ఉంది. దీనికి నిధులు ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు కూడా ఈ విషయంలో ఏమీ చెప్పలేకపోతున్నారు. పాలకులు మాత్రం అందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోంది. గ్యాస్ డెలివరీ చేసిన 48 గంటల్లోపు సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంకులో జమవుతాయని చెప్పారు. కానీ నవంబర్ లోపు గ్యాస్ బుక్ చేసుకున్న వారికి 23 రోజులు గడుస్తున్నా వేలాది మంది లబ్ధిదారులకు డబ్బులు జమ కాలేదు.
జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు: 6,56,738 కనెక్షన్లు
ఇప్పటి వరకు సబ్సిడీ చెల్లించిన గ్యాస్ కనెక్షన్లు: 2,51,659
ఇంకా సబ్సిడీ నగదు రావాల్సిన కనెక్షన్లు: 4,05,079
ఉచిత గ్యాస్ డబ్బులు పడక బ్యాంకుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు నవంబరులో బుక్ చేసిన గ్యాస్ సిలిండర్లకు ఇప్పటి వరకు డబ్బులు జమకాని వైనం ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక లబ్ధిదారుల ఆందోళన
4
పనిచేయని 1967 టోల్ ఫ్రీ...
ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి ఏదైనా సమస్యలుంటే 1967 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ నంబరుకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ప్రయోజనం ఉండడం లేదు. దాంతో జిల్లా పౌరసరఫరాల కార్యాలయం వద్దకు వెళ్లి అడగమని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అక్కడకు వెళితే లోపలకు రానివ్వడం లేదని సామాన్యులు ఘొల్లుమంటున్నారు. దీంతో ఉచిత గ్యాస్ పథకం చంద్రబాబు మాయగా ప్రజలు విమర్శిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఇలా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
ఫిర్యాదు ఎవరికి చేయాలి...
ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం డబ్బులు బ్యాంకుల్లో పడకపోవడంతో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. దాంతో అధికారులు వారికి సమాధానం చెప్పలేక విసుక్కుంటున్నారు. మాకు సంబంధం లేదని చెబుతున్నారు. దాంతో ఏజెన్సీల దగ్గరకు పోతే ఈకేవైసీ చేయించారా లేదా చూసుకోండి అనే సమాధానం వినిపిస్తోంది. ఈకేవైసీ చేయించిన వారికి కూడా సబ్సిడీ డబ్బులు పడడంలేదని చెబుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక లబ్ధిదారులు సతమతమవుతున్నారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే ఇదంతా వలంటీర్లు చూసుకునేవారు. ఎలాంటి సమస్య వచ్చినా వారి దృష్టికి తీసుకెళితే చాలు చిటికెలో పనిచేసి పెట్టేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సచివాలయం దగ్గరకు వెళ్లినా అక్కడ కూడా జవాబు చెప్పేవారుండడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment