పోలీసు ఉద్యోగం కొట్టేదెవరో..
ఒంగోలు టౌన్: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిలిమినరీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నేటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సోమవారం నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు గాను జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ట్రయిల్ రన్ నిర్వహించారు. మైదానంలోకి ప్రవేశించడానికి కేవలం అభ్యర్థులను మాత్రమే అనుమతించనున్నారు. మైదానం ప్రవేశ ద్వారం నుంచి మొదలుకొని ధ్రువపత్రాల పరిశీలన, ధ్రువపత్రాల కంప్యూటీకరణ, దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకొని తిరిగి వెళ్లే వరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. లోపలకు ప్రవేశించిన తరువాత అభ్యర్థులకు పరీక్ష ఘట్టాలకు సంబంధించిన సమాచారాన్ని వివరిస్తూ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతి ఈవెంట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించారు. అభ్యర్థుల కోసం మంచినీరుతోపాటుగా వైద్య శిబిరాన్ని సిద్ధంగా ఉంచారు. ఈ దేహదారుఢ్య పరీక్షలకు 4435 మంది పురుషులు, 910 మంది మహిళా అభ్యర్థులతో కలుపుకొని మొత్తం 5345 మంది హాజరుకానున్నారు. ఇప్పటికే వీరికి అడ్మిట్ కార్డులను పంపించారు. అడ్మిట్ కార్డులు ఉన్న వారిని మాత్రమే మైదానంలోకి అనుమతిస్తారు. రోజుకు 600 మంది పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
దళారుల మాటలు నమ్మి మోసపోద్దు
పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 12 రోజుల పాటు నిర్వహించనున్న దేహదారుఢ్య పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో అత్యంత పారదర్శకంగా ఈ పరీక్షలను నిర్వహిస్తారని, ఎలాంటి అవాంతరాలు, అసౌకర్యానికి తావు లేకుండా అన్నీ రకాల ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు వస్తాయని, మధ్య దళారుల మాటలు మోసపోద్దని స్పష్టం చేశారు. రిక్రూట్‌మెంట్ బోర్డు కేటాయించిన తేదీల్లో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట అడ్మిట్ కార్డు, సంబంధిత సర్టిఫికెట్లు తీసుకొని రావాలని సూచించారు. 1600 మీటర్లు పరుగు పందెం, 100 మీటర్ల లాంగ్ జంప్ పరీక్షలకు అన్నీ రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈవెంట్స్‌కు సంబంధించిన ట్రయల్ రన్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ ట్రయల్ రన్‌లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, డీపీవో ఏఓ రామ్మోహనరావు, ఐటీకోర్ సీఐ సూర్యనారాయణ, ఆర్‌ఐలు రమేష్ కృష్ణన్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి పోలీసు ఉద్యోగాలకు దేహదారుఢ్య పరీక్షలు జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో సర్వం సిద్ధం విజయవంతంగా ట్రయల్ రన్ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ ఏఆర్ దామోదర్
Comments
Please login to add a commentAdd a comment