అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించొచ్చు
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సులో ప్రవేశం పొందిన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీ లోగా ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఏ కిరణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.25 అపరాధ రుసుంతో 8వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుంతో 9వ తేదీ వరకు చెల్లింవచ్చన్నారు. అదే విధంగా తత్కాల్ అపరాధ రుసుంతో పదో తరగతికి రూ.500, ఇంటర్మీడియెట్‌కు రూ.1000లతో ఈ నెల 10వ తేదీ వరకు చెల్లింవచ్చని తెలిపారు. జిల్లాలోని ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్లు తమ స్టడీ సెంటర్‌లలో ప్రవేశం పొందిన అభ్యర్థులతో పరీక్ష ఫీజును ఏపీ ఆన్‌లైన్ సేవా కేంద్రం లేదా ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా నేరుగా చెల్లించవచ్చని పేర్కొన్నారు.
ఆక్వా షాపులను పక్కాగా తనిఖీ చేయాలి
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
ఒంగోలు అర్బన్: ఆక్వా షాపులను ప్రతి బుధవారం క్రమం తప్పకుండా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు పక్కాగా తనిఖీలు చేయాలని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. ప్రకాశంభవనంలో గురువారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వా రైతులు వినియోగించే రసాయనాలు, యాంటిబయోటిక్స్ నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటిపై ఆక్వా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆక్వా రంగంలో ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే క్రమంలో నిషేధిత యాంటిబయోటిక్స్ సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని జరిమానాలు విధించాలన్నారు. సమావేశంలో మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్, డ్రగ్ కంట్రోల్ అధికారి, ఫుడ్‌సేఫ్టీ అధికారి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సిడాప్ డీఆర్‌పీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు వన్‌టౌన్: సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్, ఎంటర్ ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోపుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ పథకం కింద జిల్లా రిసోర్సు పర్సన్‌ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ టి.రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మండలానికి ఒక డీఆర్‌పీని రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారన్నారు. వీరికి ఇన్సెంటివ్‌లు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు 91543 95862 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment