విద్యార్థుల్లో సేవా దృక్పథాన్ని పెంపొందించాలి
● డీఈఓ కిరణ్‌కుమార్
ఒంగోలు సిటీ: విద్యార్థుల్లో సేవా దృక్పథం పెంపొందించాలని జిల్లా విద్యాశాఖాధికారి అత్తోట కిరణ్‌కుమార్ అన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం డీఆర్‌ఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లా పరిధిలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలకు చెందిన 41 మంది ఉపాధ్యాయులకు స్కౌట్స్ మాస్టర్లుగా శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సేవా దృక్పథం అలవర్చి క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తయారు చేసేందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు మీ పాఠశాలలో స్కౌట్రూప్స్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించాలన్నారు. ఈ శిక్షణ ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. అందరూ అంకితభావంతో కొత్త విషయాలు నేర్చుకోవాలని, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బలోపేతానికి జిల్లాలోని ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉపవిద్యాశాఖాధికారి చంద్రమౌళీశ్వరరావు, జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ తన్నీరు బాలాజీ, రాష్ట్ర రిసోర్సుపర్సన్లుగా నారాయణ, శివనాగిరెడ్డి, జిల్లా ట్రెజరర్ పి.వెంకటరావు, ట్రైనింగ్ కమిషనర్ శేషారావు, రిసోర్సుపర్సన్ రాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment