డ్రోన్లతో నేరాలకు చెక్
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: జిల్లాలో నేరాలను కట్టడి చేసేందుకు సీసీ కెమెరాలతో పాటుగా డ్రోన్ కెమెరాలను విరివిగా ఉపయోగించనున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నూతన సంవత్సరంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు చెక్ పెడతామని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కొనకనమిట్ల మండలం బచ్చలకూరపాడు గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కాసు వెంకటేశ్వరరెడ్డి జిల్లా పోలీసులకు గురువారం డ్రోన్ బహూకరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ విధానంతో ముందుకు వెళుతున్న ప్రకాశం పోలీసు శాఖకు సామాజిక బాధ్యతతో డ్రోన్ బహూకరించిన వెంకటేశ్వరరెడ్డిని అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రద్దీగా ఉండే జంక్షన్లు , లా అండ్ ఆర్డర్, నేర నియంత్రణలను పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. దొంగలను గుర్తించడం, పారిపోతున్న వారిని ఛేజ్ చేయడం, బందోబస్తులు, జాతరలు, ఊరేగింపులు సమయంలో జన సమూహాన్ని పర్యవేక్షించడం సులువవుతుందన్నారు. పోలీసులు భౌతికంగా వెళ్లలేని ప్రదేశాలకు డ్రోన్లను పంపించి అక్కడి పరిస్థితులను సమీక్షించుకునేందుకు వీలుంటుందన్నారు. ప్రస్తుతం 12 డ్రోన్లు ఎగరవేస్తున్నామని, త్వరలోనే జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ల పరిధిలో డ్రోన్లు ఎగరేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ, పొదిలి సీఐ టి.వెంకటేశ్వర్లు, కొనకనమిట్ల ఎస్సై రాజ్‌కుమార్, తర్లుపాడు ఎస్‌ఐ బ్రహ్మనాయుడు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment