ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
● విద్యార్థి యువజన సంఘాల డిమాండ్
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, వెంటనే బకాయిలు చెల్లించాలని వైఎస్సార్ ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి రామాంజి యాదవ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో ఆదివారం విద్యార్థుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా విద్యాదీవెన, వసతిదీవెనల పేర్లు మార్చడమే కానీ కనీసం ఒక్క రూపాయి బకాయిలు కూడా చెల్లించలేదని విమర్శించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 7 లక్షల విద్యార్థుల సర్టిఫికెట్లు విద్యా సంస్థల యాజమాన్యాల వద్ద ఉన్నాయని, యాజమాన్యాల వద్ద సర్టిఫికెట్లు ఉండడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుందో పాలకులు చెప్పాలని నిలదీశారు. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 77ను రద్దు చేయాలని గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తున్నా, ఆందోళనలు చేపట్టినా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉందన్నారు. సోమవారం విజయవాడ ధర్నా చౌకలో జరిగే పోరుకు విద్యార్థి లోకం మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment