నేటి నుంచి బ్యూటీషియన్ కోర్సులకు శిక్షణ
సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు డొంక వద్ద మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్ కోర్సులకు సంబంధించి మహిళలకు శిక్షణ తరగతులు నేటి నుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె.రవితేజ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 నుంచి 45 సంవత్సరాల వయసున్న నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు మొబైల్ నం:9963005209 ను సంప్రదించాలన్నారు.
యూటీఎఫ్ ప్రచార యాత్రను జయప్రదం చేయండి
ఒంగోలు సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో యూటీఎఫ్ స్వర్ణోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ ఈనెల 26 నుంచి 31 వరకు జరిగే యూటీఎఫ్ ప్రచార యాత్రను విజయవంతం చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డి.వీరాంజనేయులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు జనవరి 5, 6, 7, 8 వ తేదీల్లో కాకినాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రచార యాత్ర సోమవారం సాయంత్రానికి కనిగిరి పట్టణానికి చేరుకుంది. మంగళవారం ఉదయం 7 గంటలకు కనిగిరి పట్టణంలో ప్రారంభమయ్యే ప్రచార యాత్రలో జిల్లాలోని యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొని యాత్రను జయప్రదం చేయాలని కోరారు. 10.30 గంటలకు బేస్తవారిపేట, 12.30 గంటలకు మార్కాపురం, ఒంటిగంటన్నరకు పొదిలికి, 4.30 గంటలకు ఒంగోలు పట్టణం చేరుకుంటుందని, మొత్తం 216 కిలోమీటర్లు దూరం 5 సెంటర్ల గుండా జిల్లా కేంద్రానికి ప్రచార యాత్ర వస్తుందని తెలిపారు. ఆయా సెంటర్లలోని యూటీఎఫ్ కార్యకర్తలు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు భారీగా పాల్గొని ప్రచార యాత్ర జయప్రదం చేయాలని కోరారు. అలాగే ఆయా సెంటర్లలో యూటీఎఫ్ జెండా ఆవిష్కరించాలన్నారు. ఈ ప్రచార యాత్రకు జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్.రవి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.
వైఎస్సార్ సీపీ నుంచి సామంతుల సస్పెన్షన్
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షుడు సామంతుల రవికుమార్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రక్తదాన శిబిరాలు నిర్వహించాలి
● ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు 30 శాతం రక్తం ప్రభుత్వానికి ఇవ్వాలి
● డీఎంహెచ్‌ఓ డా.వెంకటేశ్వర్లు
ఒంగోలు టౌన్: ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు సేకరించిన రక్తం నుంచి 30 శాతం రక్తాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని ఛాంబర్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్లడ్ బ్యాంకు వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు ఎక్కువగా క్యాంపులను నిర్వహించడం ద్వారా రక్త నిల్వలు సేకరించాలని సూచించారు. నెలవారీ నిర్వహించే క్యాంపుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి తెలియజేయాలని చెప్పారు. బ్లడ్ బ్యాంకు క్యాంపు నిర్వహించే ప్రదేశాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐఈసీ ప్రచారం చేయాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా చైతన్యవంతం చేయాలని చెప్పారు. దాతల పూర్తి చిరునామా, మొబైల్ ఫోన్ నంబర్లు సేకరించాలని ఆదేశించారు. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు నిర్వహించే క్యాంపుల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కానీ ఒక అధికారి వచ్చి పర్యవేక్షిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ, బ్లడ్ బ్యాంక్స్ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి సరోజిని, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ కిరణ్, బ్లడ్ బ్యాంకుల వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment