క్రీడలకు.. కూటమి చీడ | - | Sakshi
Sakshi News home page

క్రీడలకు.. కూటమి చీడ

Published Thu, Jan 2 2025 12:59 AM | Last Updated on Thu, Jan 2 2025 12:59 AM

క్రీడలకు.. కూటమి చీడ

క్రీడలకు.. కూటమి చీడ

భావి క్రీడాకారులను తయారు చేయాల్సిన క్రీడా వికాస కేంద్రాలకు పచ్చ గ్రహణం పట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పచ్చ పార్టీ నేతలు వీటిపై కన్నేశారు. ఒక వైపు వీటిని తన అధీనంలోకి తెచ్చుకుని పెత్తనం చెలాయిస్తూనే..మరో వైపు అనధికారికంగా క్రీడాకారుల దగ్గర నుంచి నగదు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాప్‌ అధికారులు, సిబ్బంది తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు వారి సేవలో తరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మార్కాపురం టౌన్‌:

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండోర్‌ స్టేడియంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్లే అండ్‌ పే విధానంలో అధికారికంగా టెండర్లు పిలిచి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి క్రీడాకారులు నెలకు నగదును చెల్లించి వినియోగించుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిస్థితి మారిపోయింది. కూటమి నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అంతా మా ఇష్టం అంటూ... క్రీడా వికాస కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో బెదిరింపులకు దిగుతున్నారు. అప్పటి వరకూ ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న వారికి రాజకీయ రంగు పులిమి వారిపై వేధింపులు ప్రారంభించారు. లీజు రద్దు చేసుకునే వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను చేతులోక్లి తీసుకొని ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా జేబులు నింపుకుంటున్నారని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు.

అధికారం అడ్డుపెట్టుకొని...

జిల్లాలో మార్కాపురంతో పాటు యర్రగొండపాలెం, సంతనూతలపాడు, ఒంగోలులో క్రీడా వికాస కేంద్రాలు ఉన్నాయి. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు కూటమి నాయకులు అక్రమ సంపాదనకు ఈ కేంద్రాలపై కుట్రలు మొదలెట్టారు. అక్రమ సంపాదన కోసం క్రీడా వికాస కేంద్రాలను కూడా వాడుకుంటున్నారు కూటమి నాయకులు. మర్కాపురంలోని క్రీడా వికాస కేంద్రం నిర్వహణ బాధ్యత శాప్‌ అధికారికంగా ఎవరికీ అప్పగించకపోవడంతో అనధికారికంగా కూటమికి చెందిన నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కూటమి నేతలు క్రీడాకారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసినా.. శాప్‌ అధికారులు చూసీ చూడనుట్లు వ్యవహరిస్తున్నారు.

మార్కాపురంలో దందా ఇలా..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మార్కాపురం పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.2 కోట్ల వ్యయంతో ప్లే అండ్‌ పే పద్ధతిన క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మించింది. అప్పటి క్రీడల, టూరిజం శాఖ మంత్రి ఆర్‌కే రోజా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. క్రీడా వికాస కేంద్రం నిర్మాణ కాంట్రాక్టర్‌ బి.వెంకటేశ్వరరెడ్డి టెండర్‌లో దక్కించుకున్నారు. అనంతరం ఇండోర్‌ స్టేడియం నిర్వహణ బాధ్యతను కె.శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అప్పగించారు. నాడు టెండర్‌ ద్వారా శాప్‌కు రూ.లక్ష డిపాజిట్‌ కూడా చెల్లించారు. దీంతో నెల నెల రూ.15,116 లీజు నగదును శాప్‌కు చెల్లిస్తున్నారు. దీంతో పాటు వాచ్‌మెన్‌, స్వీపర్‌ జీతాలను చెల్లించడంతో పాటు విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లిస్తుస్తున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో టీడీపీ నేతలు రంగప్రవేశం చేశారు. ముందుగా లీజు పొందిన వ్యక్తిని భయపెట్టి లీజును రద్దు చేసుకునే విధంగా ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేది లేక లీజు రద్దు చేసుకుంటున్నట్లు శాప్‌ ఎండీకి లేఖ పంపారు. రూ.లక్ష డిపాజిట్‌ కూడా ఇవ్వాలని కోరారు. క్రీడా వికాస కేంద్రం తాళాలు కూడా అధికారులకు అప్పగించారు. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వ నేతలు ఎలాంటి అనుమతులు లేకుండా క్రీడా వికాస కేంద్రాన్ని నిర్వహస్తున్నారు. క్రీడాకారుల నుంచి నెలకు రూ.600 వంతున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు ఈ అక్రమ వసూళ్ల విషయం తెలిసినా పట్టించుకోకపోవడం వారి స్వామి భక్తిని చాటుకుంటున్నట్లు పలువురు క్రీడాకారులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా మెయింటెనెన్స్‌ ఇబ్బందులు, క్రీడాకారులకు ఆటలపై ఆసక్తిని కోల్పేయే పరిస్థితి నెలకొంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూటమి నేతల చెరలో ప్లే అండ్‌ పే క్రీడా వికాస కేంద్రాలు చోద్యం చూస్తున్న జిల్లా శాప్‌ అధికారులు ఎంత లీజు ఇస్తే అంత జమ చేసుకొని మౌనం నెల నెలా క్రీడాకారుల నుంచి ఫీజులు వసూలు జిల్లాలోని నాలుగు కేవీకే సెంటర్లల్లో ఇదే పరిస్థితి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement