5న ఏకసభ్య కమిషన్ జిల్లాకు రాక
● జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు
ఒంగోలు అర్బన్: షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఈ నెల 5వ తేదీ జిల్లాలో పర్యటిస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు తెలిపారు. ఏకసభ్య కమిషన్ పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో డీఆర్‌ఓ సమావేశం నిర్వహించారు. రంజన్ మిశ్రా ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు ఒంగోలు చేరకుంటారని, అనంతరం ఎస్సీ కాలనీల్లో పర్యటిస్తారని తెలిపారు. 6వ తేదీ ప్రకాశంభవనంలో జిల్లా అధికారులతో సమీక్షిస్తారన్నారు. ఆ తర్వాత దళిత, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాలు, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని వివరించారు. ఈ మేరకు శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను వివిరంచారు. ఉమ్మడి ప్రకాశంలోని దళిత ఉద్యోగుల వివరాలను ఉప కులాలతో సహా గురువారం సాయంత్రం లోగా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారికి అందజేయాలన్నారు. పర్యటనకు సంబంధించి బందోబస్తు, వసతితో పాటు వినతుల స్వీకరణకు ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. పర్యటనపై గ్రామాలో దండోరా వేయించి ప్రజలకు తెలియచేయాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అంధులకు ఆటల పోటీలు
ఒంగోలు వన్‌టౌన్: లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా అంధులకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు జి.అర్చన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం, బాపట్ల జిల్లాలలోని అంధులకు ఈ నెల 3వ తేదీన ఒంగోలు సంతపేటలోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఉదయం 10 గంటలకు ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు. అదే విధంగా ఈ నెల 4న కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో లూయి బ్రెయిలీ జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన అంధులు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ
ఒంగోలు వన్‌టౌన్: రూడ్‌సెట్ సంస్థ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 30 రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులన్నారు. అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెంది 19 నుంచి 45 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు. ఇతర వివరాలకు 8309915577 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఆర్జేడీ సుబ్బారావును కలిసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యామండలి పరీక్షల నియంత్రణాధికారి, గుంటూరు జోన్ ఆర్జేడీ వీవీ సుబ్బారావును ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ చైర్మన్ కుమ్మరికుంట సురేష్ ఆధ్వర్యంలో బుధవారం కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేయాలని, తమ సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పి.మాధవరావు, బీవీ కాశీరత్నం, చల్లా శ్రీనివాసరావు, హజరత్తయ్య, గల్లా ప్రభాకర్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment