ప్రజా సమస్యలు సహేతుకంగా పరిష్కరించాలి
ఒంగోలు అర్బన్: గ్రీవెన్స్‌లో వచ్చిన ప్రజా సమస్యలు సహేతుకంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ హాలులో మీకోసం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొక్కుబడి సమాధానాలతో అర్జీదారులకు ఎండార్స్‌మెంట్ ఇస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సమస్యలు పునరావృతం కాకుండా క్షేత్ర స్థాయిలో పరిష్కరించాలన్నారు. ఒకవేళ పరిష్కరించలేని సమస్య ఉంటే అర్జీదారులను పిలిచి వివరించాలన్నారు. మీకోసం కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో అధికారులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. దీనిలో డీఆర్‌ఓ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు లోకేశ్వరరావు, పార్ధసారథి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ హాలు వద్ద ఏర్పాటు చేసిన సేంద్రియ కూరగాయల విక్రయాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. సేంద్రియ కూరగాయల వినియోగాన్ని ప్రోత్సహించేలా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. అర్జీదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్జీలు ఉచితంగా రాయడంతో పాటు ఆయా శాఖల కౌంటర్ల వద్దకు తీసుకెళ్లేలా ఏర్పాటు చేశామన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment