ప్రసవ మరణాలు తగ్గించడమే లక్ష్యం
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు
ఒంగోలు టౌన్: ప్రసవ సమయంలో మాతృ, శిశు మరణాలు జరగకుండా ఏఎన్‌ఎంలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. సోమవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కాన్పు సమయంలో అధిక ప్రమాదం కలిగిన మహిళలకు సంబంధించి గర్భధారణ నియమాలపై నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. అధిక రక్తపోటు, మధుమేహం, ఎపిలెప్సి, ప్రసవ సమయంలో అధిక రక్త స్రావం కలిగిన ప్రమాదకర సంకేతాలు కలిగిన గర్భిణీలను గుర్తించి సకాలంలో వారికి సరైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు ఎంసీపీ కార్డు, ఆర్‌సీహెచ్ రిజిస్టర్ పోర్టల్, అభా డిజిటల్ యాప్‌లో నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. టీబీ, లెప్రసీతో బాధ పడుతున్న వారిని సకాలంలో గుర్తించి వారికి తక్షణ వైద్యం అందించాలని జిల్లా టీబీ, లెప్రసీ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ ఆదేశించారు. శిశువులు, గర్భిణులలకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ పద్మజ చెప్పారు. అంగన్‌వాడీ పిల్లలకు, స్కూలు పిల్లలకు వారి పరిధిలోనే వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా పుట్టుకతో లోపాలను నిర్దారించి ఒంగోలు, మార్కాపురంలోని ఎర్లీ ఇంటర్‌వెన్షనల్ సెంటర్‌కు రెఫర్ చేయాలని ఎన్‌సీడీ జిల్లా నోడల్ అధికారి డా.భగీరధి చెప్పారు. ఈ శిక్షణలో అర్మాన్ సంస్థ ప్రతినిధి డాక్టర్ చరణ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించారు. కార్యక్రమంలో డీపీహెచ్‌ఎన్‌ఓ సుగుణమ్మ, మాస్ మీడియా అధికారి డి.శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ కె.శ్రీదేవి, ఎంఐఎస్ టి.శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment