అలసత్వం వీడండి | - | Sakshi
Sakshi News home page

అలసత్వం వీడండి

Published Wed, Dec 25 2024 1:15 AM | Last Updated on Wed, Dec 25 2024 1:15 AM

అలసత్వం వీడండి

అలసత్వం వీడండి

బుధవారం శ్రీ 25 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024
కేంద్ర పథకాలపై
● ప్రభుత్వ ఆస్పత్రుల తీరు మారాల్సిందే.. ● సిండికేట్‌ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టండి ● ఎన్ని నిధులైనా తెస్తా.. అభివృద్ధిపై దృష్టిసారించండి ● అధికారులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ ఆదేశాలు ● కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ‘దిశ’ మానిటరింగ్‌ సమావేశం

నిధులిస్తున్నా.. ఫలితాలేవి?

సమగ్ర శిక్షా అభియాన్‌ కార్యక్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తున్నా.. ఆశించిన ఫలితాలు రావడం లేదని కేంద్రమంత్రి సంజయ్‌ అన్నారు. ఈ ఏడాది రాజన్నసిరిసిల్ల జిల్లాకు రూ.28.62 కోట్లు ఇస్తే రూ.8.55 కోట్లే ఖర్చు చేశారు.. మిగతావి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆ నిధులు మీ వద్దే ఉన్నాయా? డైవర్ట్‌ చేశారా? రాష్ట్ర వాటా నిధులు విడుదలయ్యాయా.. వివరాలన్నీ పంపాలని ఆదేశించారు. ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగులకు సక్రమంగా వేతనాలిస్తున్నారా? వాళ్లెందుకు ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. వారికి నచ్చజెప్పాలని సూచించారు. పీఎంజీఎస్‌వైలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లాకు గత ఆర్దిక సంవత్సరంలో 12 రోడ్లు, కరీంనగర్‌కు 16 రోడ్లు మంజూరు చేస్తే రెండు ప్రాంతాల్లో కలిపి ఒకటి చొప్పున రోడ్ల పురోగతి మాత్రమే ఉందని, మిగతావి ఎందుకు ఆలస్యమవుతున్నాయని ఆరా తీశారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌: ‘ఢిల్లీలో ఉన్నా.. గల్లీలో ఉన్నా కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధి ప్రజల బాగోగులే నా లక్ష్యం.. అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా తెస్తా.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం వీడాలి..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అధికారులకు చురుకలంటించారు. మంగళవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల జిల్లాల అభివృద్ధి సమన్వయ మానిటరింగ్‌ కమిటీ(దిశ) సమావేశం రెండు గంటలపాటు వాడీవేడిగా సాగింది. కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, రెండు జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్‌కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, శిక్షణ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, కేంద్ర హోంశాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ, కరీంనగర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ చాహత్‌ వాజ్‌పేయ్‌ సహా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. వివిధ శాఖలపై క్షుణ్ణంగా సమీక్షిస్తూ అధికారుల అలసత్వంపై కేంద్ర మంత్రి సంజయ్‌ అగ్రహాం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు రెండు కళ్లలాంటివని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయ డం ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందన్నా రు. గడువు ముగిసినా రోడ్ల పనులు ఎందుకు మందకొడిగా సాగుతున్నాయని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లందరూ సిండికేటై, తమాషా చేస్తుంటే బ్లాక్‌ లిస్టులో ఎందుకు పెట్టడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు జరిగిన స్మార్ట్‌సిటీ పనులకు(రూ.398 కోట్లు) యూసీలిస్తే మిగతా రూ.70 కోట్లు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల తీరు దయనీయంగా ఉందని, కేంద్రం వేల కోట్ల నిధులిస్తుంటే కాటన్‌, మందులు, ఎక్స్‌రే మెషిన్లు లేవని రోగులను బయటకు పంపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై తీరు మారాలని, పేదలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నియామకాల్లోనూ భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని వచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

స్టవ్‌పై మధ్యాహ్న భోజనం వండాలి..

కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా గ్యాస్‌ స్టవ్‌పై మధ్యాహ్న భోజనం వండాలని కేంద్రమంత్రి సంజయ్‌ ఆదేశించారు. అలాగే, కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో జరుగుతున్న రోడ్ల పనుల్లో ఏవి స్మార్ట్‌సిటీ నిధులతో చేస్తున్నారో, ఏవి నియోజకవర్గ అభివృద్ధి నిధి(సీడీఎఫ్‌) కింద చేస్తున్నారో గందరగోళం నెలకొందన్నారు. ఏ నిధులతో ఏ పనులు చేపడుతున్నారో వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు. కరీంనగర్‌ నగరంలో రోడ్ల పనులన్నీ పూర్తయిన తర్వాతే కొత్త రోడ్లు మంజూరు చేయాలని సూచించారు.

కొత్త రోడ్లకు నిధులు తెస్తా..

కొత్త రోడ్లకు అవసరమైతే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి సంజయ్‌ అన్నారు. వైద్యశాఖపై జరిగిన సమీక్షలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.7 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5.29 కోట్లు ఇచ్చామని తెలిపారు. వాటిని దేనికి ఖర్చు చేశారో వివరాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేసి, ఒక్కో స్కూల్‌కు కేంద్రం నుంచి నిధులిస్తే.. రెండు, మూడు పాఠశాలల్లో మినహా మిగతా చోట్ల ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. సంబంధిత నిధులు పక్కాగా వాడుతున్నారా లేదా అని ప్రశ్నించగా అధికారుల నుంచి సమాధానం లేదు. దీంతో పనితీరు మార్చుకోవాలని, కేంద్ర నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా బాధ్యతతో పని చేయాలని డీఈవోకు సూచించారు.

పథకాలపై అవగాహన కల్పించాలి..

బేటీ బచావో–బేడీ పడావో, పోషణ్‌ అభియాన్‌ సహా కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్రమంత్రి సంజయ్‌ సూచించారు. ఈసారి ఈ కార్యక్రమానికి సంబంధించి మంజూరు చేసిన నిధులను వేటికి ఖర్చు పెట్టారో పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు. అలాగే, దివ్యాంగులకు పరికరాలు ఇచ్చేందుకు అమలు చేస్తున్న సుగమ్య భారత్‌ అభియాన్‌ కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంచి ఫలితాలనిస్తోందని అధికారులను అభినందించారు. ఉపాధిహామీ పథకం కింద కూలీలకు ఆశించిన సంఖ్యలో పని దినాలను ఎందుకు కల్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో తీరు మార్చుకోవాలని సూచించారు. ఎంపీ నిధులకు సంబంధించి ఈ ఏడాది రూ.5 కోట్ల ఖర్చు విషయంలో ఇంకా అనుకున్న పురోగతి లేదన్నారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎందుకు నిధులను పక్కాగా వినియోగించలేకపోతున్నారని అడిగారు. నాకున్న ఫీడ్‌ బ్యాక్‌ ప్రకారం.. ఎంపీ నిధులు అనేసరికి కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. దీని మీద క్లారిటీ ఇవ్వాలన్నారు. రెండు జిల్లాల్లో ఎంపీ నిధులతో చేపట్టిన పనులపై తక్షణమే పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement