యువతకు ప్రోత్సాహం కరువు
● ఊసేలేని జాతీయ సమైక్యత శిబిరాలు ● పట్టింపు లేని యువజన సంఘాలు ● నియామకాలు లేని ఎన్‌ఎస్‌వీ వ్యవస్థ
బోయినపల్లి(చొప్పదండి): ‘ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు.. వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం’ అన్న స్వామి వివేకానంద మాటలను ప్రస్తుత ప్రభుత్వాలు మరిచినట్లు ఉన్నాయి. ఒకప్పుడు యువజన సంఘాలను ప్రోత్సహించడం ద్వారా గ్రామాల్లో యువత ప్రాముఖ్యతను చాటిచెప్పాయి. యువజన సంఘాలు సైతం గ్రామాల్లో శ్రమదానాలు.. రక్తదాన శిబిరాలు.. ఆరోగ్యశిబిరాలు పెడుతూ ఆదర్శంగా నిలిచేవి. ప్రస్తుతం యువజన సంక్షేమం పడకేసింది. ఏటా యువజనోత్సవాలు నిర్వహిస్తున్నా యువత పాత్ర అంతంతే ఉంది. ఈనెల 12 నుంచి 19 వరకు యువజనోత్సవాలు నిర్వహించినా యువత గురించి పెద్దగా పట్టించుకున్న వారు లేరు. దీనిపై ప్రత్యేక కథనం.
కొత్తగా మై భారత్ పోర్టల్
కరీంనగర్‌లో నెహ్రూ యువకేంద్రం యువజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. నెహ్రూ యువకేంద్రతో ఉమ్మడి జిల్లాలో సుమారు 818 వరకు యువజన సంఘాలు ఆన్‌లైన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి జిల్లాలో 200 వరకు యువజన సంఘాలు మాత్రమే యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, ఎన్‌వైకే కలిపి ప్రస్తుతం నెహ్రూయువ కేంద్ర కార్యక్రమాలు మై భారత్(మేరా యువభారత్) పోర్టల్‌లో చేపడుతున్నారు. గతంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఏటా ఉత్తమ యువజన సంఘాలకు రూ.25వేల నగదు అవార్డు, వ్యక్తిగతంగా అవార్డులు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ ఊసే లేదు. ఉత్తమ యువజన అవార్డుల ఊసే లేదు. బ్లాక్ స్థాయి యువజన సంఘాల పరిధిలో క్రీడాపోటీలు మాట మరిచిపోయారు. మహిళలకు కుట్టుశిక్షణ, యువజన సంఘాలకు స్పోర్ట్స్ కిట్స్, యూత్ లీడర్‌షిప్ ట్రెయినింగ్ ప్రోగ్రాంలను నిర్వహించి యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించే వారు. గత మూడేళ్లుగా అలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు.
నియామకాలు లేని ఎన్‌ఎస్‌వీ
గ్రామాల్లో యువజన సంఘాలకు, నెహ్రూ యువకేంద్రానికి మధ్య వారధిలా ఎన్‌ఎస్‌వీ(నేషనల్ సర్వీస్ వలంటీర్) ఉండేవారు. ఎన్‌ఎస్‌వీలు వారికి కేటాయించిన బ్లాక్‌ల పరిధిలోని గ్రామాల్లోని యువతను స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనేలా జాగృతం చేసేవారు. కాగా గత 2024 ఏప్రిల్ నుంచి ఎన్‌ఎస్‌వీల నియామకం లేదు. దీంతో గ్రామాల్లో యువజన సంఘాలు బలోపేతం కావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment