![● ‘అభయహస్తం’తో ప్రయోజనం ● చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06srl04-180076_mr-1738869041-0.jpg.webp?itok=hvO9jWUt)
● ‘అభయహస్తం’తో ప్రయోజనం ● చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు
సిరిసిల్ల: నేతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే అమలులో ఉన్న నేతన్నల పొదుపునిధి, నేతన్నల భద్రత, నేతన్నల భరోసాలను కలిపి చేనేత ‘అభయహస్తం’ పేరుతో అమలు చేస్తుంది. ఇందులో ఇప్పటికే రెండు పథకాలు అమలులో ఉండగా.. కొత్తగా నేతన్నల భరోసా పథకాన్ని చేర్చారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల్లోని నిబంధనలు సడలించింది. జిల్లాలో 25వేల మరమగ్గాలు ఉండగా.. వస్త్రోత్పత్తితోపాటు అనుబంధ రంగాల్లో 10వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. చేనేత మగ్గాలు 126 వరకు ఉండగా.. 36 మంది వృద్ధ నేత కార్మికులు పనిచేస్తున్నారు. గతేడాది త్రిఫ్ట్ పథకంలో కేవలం 5,723 మంది పవర్‌లూమ్ కార్మికులు చేరి పొదుపు చేసుకున్నారు. కరోనా కాలంలో త్రిఫ్ట్ పొదుపు డబ్బులు నేతన్నలకు ఎంతగానో అక్కరకొచ్చాయి. కొత్తగా అభయహస్తం పథకంతో మరింత మంది కార్మికులు ఈ పథకంలో చేరే అవకాశం ఉంది.
బీమా వయసు సడలింపుతో ప్రయోజనం
చేనేత, మరనేత మగ్గాలపై శ్రమించే కార్మికులకు గతంలో ప్రభుత్వం బీమా కల్పించినా అది 59 ఏళ్లలోపు వారికే వర్తించింది. కార్మికులు ఎలా మరణించినా.. వారి కుటుంబాని(నామిని)కి రూ.5లక్షలు ఎల్‌ఐసీ చెల్లించేది. ఇలా ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 మందికి రూ.2.60కోట్లు పరిహారంగా చెల్లించారు. వస్త్రోత్పత్తి రంగంలో ఎక్కువగా 59 ఏళ్ల పైబడిన వారు ఉండడం, ముఖ్యంగా చేనేత మగ్గాలపై వృద్ధులే ఉండడంతో బీమా పథకం దూరమైంది. కానీ కొత్తగా అభయహస్తం పథకంలో వయసుతో సంబంధం లేకుండా.. చేనేత, మరమగ్గాల సొసైటీల ద్వారా బీమా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్థికసాయంపై ఖరారుకాని విధివిధానాలు
చేనేత, మరనేత, అనుబంధ రంగాల్లో శ్రమిస్తున్న నేతన్నలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అభయహస్తం పథకంలో మరో ఆర్థికసాయం ప్రకటించింది. ఇందులో వస్త్రపరిశ్రమలో పనిచేసే కార్మికుడికి ఏటా రూ.18వేలు, అనుబంధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఏటా రూ.6వేలు చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏటా రూ.44కోట్లను కేటాయించింది. కానీ ఈ పథకం అమలుపై ప్రభుత్వం ఇంకా విధివిధానాలు విడుదల చేయలేదు.
గైడ్‌లైన్స్ జారీ అయ్యాయి
చేనేత ‘అభయహస్తం’ పథకంలో భాగంగా త్రిఫ్ట్ ఫండ్ పొదుపు నిధి పథకానికి గైడ్‌లైన్స్ జారీ అయ్యాయి. నేతన్నల కుటుంబాలకు భద్రత కల్పించే బీమా పథకంలో వయసు నిబంధనలు సడలించడంతో చేనేత కార్మికులకు ఎక్కువగా ప్రయోజనం దక్కనుంది. నేతన్న భరోసా పథకానికి ఇంకా మార్గదర్శకాలు జారీ కాలేదు. – మిట్టకోల సాగర్,
చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు
Comments
Please login to add a commentAdd a comment