హక్కుల సాధనకు ఉద్యమిద్దాం
షాద్‌నగర్: హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుదామని లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సాయిరాజా ఫంక్షన్ హాల్‌లో ఆదివారం లంబాడీల గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ నుంచి ఫంక్షన్‌హాల్ వరకు గిరిజనులు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంబల్ నాయక్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా గిరిజనులు మాత్రం అన్ని రంగాల్లో వెనకబడే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందించాలని అన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. పట్టణాలకు, గ్రామాలకు దూరంగా ఉండే తండాల్లో నివాసం ఉంటున్న గిరిజనులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు చందు నాయక్, నాయకులు మిట్టు నాయక్, శ్రీను నాయక్, లక్ష్మణ్ నాయక్, హన్యా నాయక్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్
Comments
Please login to add a commentAdd a comment