ప్రజల చూపు.. వామపక్షాల వైపు
● ఆ మూడు పార్టీలవి మాటలేతప్ప చేతలు లేవు ● ఇక వారి చుట్టూ తిరిగేది లేదు ● సీపీఎం నేత వీరయ్య స్పష్టీకరణ
సంగారెడ్డి ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వామపక్షాల వైపు మొగ్గు చూపుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యంగా ఎర్రజెండా అవసరం ఏర్పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య వ్యాఖ్యానించారు. సోమవారం సంగారెడ్డిలోని కేవల్‌కిషన్ భవన్‌లో సీపీఎం మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ సంగారెడ్డిలో జనవరి 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగే రాష్ట్ర మహాసభలకు చారిత్రాత్మక ప్రాధాన్యత ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో బీఆర్‌ఎస్ పాలన చూశాం.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన చూస్తున్నామని, అన్ని పార్టీలు కేవలం అధికారం కోసం తమలో తాము కొట్లాడటమే తప్ప ప్రజల అవసరాలను తీర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని విమర్శించారు. పెట్టుబడిదారులు, ధనిక రైతుల ప్రయోజనాలే తప్ప పేద వర్గాల ప్రజల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మీదట రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీల చుట్టూ తిరిగేది లేదని, ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయని, ఆర్టీసీ పట్ల బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందన్నారు, మూడు పార్టీలకు ఏ మాత్రం తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ని కలిసి సమ స్యలు పరిష్కరించాలని కోరితే ఆప్యాయంగా మాట్లాడుతాడు తప్ప పనులు మాత్రం కావన్నారు. ధర్నాచౌక్ మళ్లీ ఎర్రజెండా వల్లే ప్రారంభమైందని, బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చామన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment