అనాథలు ఆమడదూరం | - | Sakshi
Sakshi News home page

అనాథలు ఆమడదూరం

Published Fri, Jan 17 2025 10:33 AM | Last Updated on Fri, Jan 17 2025 10:33 AM

అనాథలు ఆమడదూరం

అనాథలు ఆమడదూరం

నిరుపయోగంగా నిరాశ్రయ కేంద్రం ● పట్టణానికి దూరమే కారణం

మెదక్‌జోన్‌: నిర్భాగ్యులను అక్కున చేర్చుకుని వారికి భోజన వసతి సదుపాయాలు అందించేందుకు రూ.లక్షల వ్యయంతో మెదక్‌ జిల్లాకేంద్రంలో నిర్మించిన నిరాశ్రయకేంద్రం నిరుపయోగంగా పడి ఉంటోంది. కేంద్రంలో అన్ని సదుపాయాలున్నా అనాథలు మాత్రం వాటిని వినియోగించుకునేందుకు ముందుకు రావడంలేదు. జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లోని ఫుట్‌పాత్‌లు, బస్టాండ్లలోనే పడుకుంటున్నారు తప్ప నిరాశ్రయకేంద్రంవైపు ముఖం చూపట్లేదు. ఈ నిరాశ్రయకేంద్రం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పట్టణం నుంచి ఇక్కడకు చేరుకోవాలంటే ఆటోకు రూ.50 వెచ్చించాల్సిన పరిస్థితి. అంత మొత్తంలో చెల్లించలేని అనాథలు బస్టాండ్లు, ఇతరచోట్లలోనే నిద్రిస్తున్నారు తప్ప ఈ కేంద్రంవైపు కన్నెత్తి చూడటంలేదు.

తరలించినప్పటికీ...

అప్పుడప్పుడు బస్టాండ్లలో, ఫుట్‌పాత్‌లపై, చర్చి ప్రాంగణంలో రాత్రి వేళలో ఎవరైనా నిద్రిస్తే వారిని నిరాశ్రయల కేంద్రం సిబ్బంది ఆటోలలో తరలించినప్పటికీ రాత్రికి భోజనం చేసి ఉదయం జిల్లా కేంద్రానికి వెళ్లి మరుసటి రోజు రావటం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా రోడ్డు పక్కనే నిద్రిస్తున్న మహిళలపై కొంతమంది అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆ మహిళలకు జరిగిన అన్యాయాన్ని సైతం చెప్పుకోలేని స్థితిలో నలిగిపోతున్నవారెందరో ఉంటున్నారు. ఇటీవల మాసాయిపేట మండలం రామంతాపూర్‌ గ్రామ శివారులోని ఓదాబా వెనుకాల మతిస్థిమితం లేని మహిళపట్ల జరిగిన గ్యాంగ్‌రేపే ఇందుకు ఓ తాజా ఉదాహరణ.

అనాథలకు భరోసా కల్పించాలి...

ఇలాంటి అనాథలు జిల్లావ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో గుర్తించి వారందర్నీ నిరాశ్రయుల కేంద్రానికి తరలించి అక్కడే ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు అధికారులతోపాటు ఎన్జీవో సంస్థలు కూడా బాధ్యత తీసుకుని వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

50 మందికి

భోజన వసతి

సదుపాయాలున్నా ఫుట్‌పాత్‌లపైనే నిద్ర

వృథాగా రూ.65లక్షల భవనం

నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పిల్లి కొటాల్‌ శివారులో 2023లో అప్పటి రూ.65 లక్షల వ్యయంతో ఈ నిరాశ్రయకేంద్రాన్ని నిర్మించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)తోపాటు ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. ఈ నిరాశ్రయకేంద్రంలో 50 మంది వరకు అనాథలకు భోజన, వసతి సదుపాయాన్ని కల్పించగలిగే అవకాశముంది. 50 మంచాలతో పాటుగా దుప్పట్లు, ప్లేట్లున్నాయి. ఇద్దరు వంట మనుషులు, వాచ్‌మెన్‌, మరో ఇన్‌చార్జితో సహా మొత్తం నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే వీటిని అనాథలెవరూ వినియోగించుకోకపోవడంతో ఈ భవనం నిరుపయోగంగా పడి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement