ప్రభుత్వం కక్ష సాధిస్తోంది
కాంగ్రెస్ తీరుపై ఎమ్మెల్యే సునీతారెడ్డి ధ్వజం
నర్సాపూర్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ధ్వజమెత్తారు. తమ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు రేవంత్‌రెడ్డి సర్కార్ పాల్పడుతోందని అందులో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించిందని ఆమె ఆరోపించారు. నర్సాపూర్‌లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...కేటీఆర్ కృషి ఫలితంగానే ఈ కార్ రేస్ మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పారు. ఈకార్ రేస్‌లో పెట్టుబడులు పెట్టడంతో రాష్ట్రానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరిందని ఓ సర్వే సంస్థ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అసెంబ్లీలో ఈ కార్ రేస్‌పై చర్చ పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలిసేవని చెప్పారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు చేయకపోవడంతో ప్రజలు తమను నిలదీస్తారనే భయంతో వారి దృష్టిని మరల్చేందుకే కేటీఆర్‌పై అక్రమ కేసు బనాయించిందని ఆరోపించారు. కేటీఆర్ కడిగిన ముత్యంలా విచారణ నుంచి బయటకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
19న మంత్రి దామోదర రాక
ఈనెల 19న రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ నర్సాపూర్ వస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి చెప్పారు. అమృత్ 2.0 పథకం కింద నర్సాపూర్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.11.90కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన తాగునీటి పథకం ట్యాంకులు, పైపులైను నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు ఆమె చెప్పారు. అదేవిధంగా ఈనెల 17నుంచి రెండు రోజుల పాటు జరిగే నర్సాపూర్‌లోని శ్రీ శీతలమాత దేవాలయ నవమ వార్షికోత్సవాలలో పాల్గొనాలని పలువురు ముదిరాజ్ సంఘం సభ్యులు దశరథ్, జగదీశ్వర్‌లు ఎమ్మెల్యే సునీతారెడ్డికి ఆహ్వానపత్రం అందచేసి ఆహ్వానించారు. సమావేశంలో సునీతారెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయిమోద్దీన్, బీఆర్‌ఎస్ నాయకులు సంతోష్‌రెడ్డి, సత్యంగౌడ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment