పనులు పర్యవేక్షించేదెవరు?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గృహ నిర్మాణశాఖలో ప్రస్తుతం ఇంజనీర్లు లేరు. మరి వేలల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ గృహాల నిర్మాణం పనులను ఎవరు పర్యవేక్షించాలి.. పనులు ఎంత వరకు జరిగాయని ఎంబీ రికార్డులు ఎవరు చేయాలి. వాటి బిల్లులు చెల్లించేందుకు కొలతలు రికార్డులు చేసేదెవరు..? గత ప్రభుత్వ హయాంలో ఈ గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరిని ఇతర శాఖలకు పంపారు. ఇంజనీరింగ్ అధికారులను ఇతర శాఖల ఇంజనీరింగ్ శాఖల్లో సర్దుబాటు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడం.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఒక్కో నియోజకవర్గానికి వేలల్లో ఇళ్లను మంజూరు చేస్తోంది. దీంతో ఈ గృహాల నిర్మాణాలను పర్యవేక్షించడానికి అవసరమైన ఇంజనీర్లు ప్రస్తుతానికి అందుబాటులో లేరు.
తిరిగొచ్చిన వారు తక్కువే..
గృహ నిర్మాణశాఖ నుంచి వివిధ శాఖలకు వెళ్లి పోయిన ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన ఉద్యోగులు కొన్ని నెలల క్రితం తిరిగి సొంతశాఖకు వచ్చేశారు. కానీ ఇలా తిరిగిన వచ్చిన అధికారులు చాలా తక్కువే. జిల్లాలో ఇటీవలే ఈశాఖకు పర్యవేక్షక ఇంజనీర్‌ను కేటాయించారు. కొద్ది రోజుల క్రితం ముగ్గురు డీఈలు, నలుగురు అసిస్టెంట్ ఇంజనీర్లను తిరిగొచ్చారు. ఇద్దరు ముగ్గురు వర్క్ ఇన్‌స్పెక్టర్లు వచ్చారు. కానీ వేలల్లో మంజూరయ్యే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా పర్యవేక్షించాలన్నా.. అమలు చేయాలన్నా.. మండలానికి ఒక ఏఈ, మూడు నాలుగు మండలాలకు ఒక డీఈ, ఒకటీ రెండు నియోజకవర్గాలకు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవసరం. దీంతో ఈ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై ఆశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై..
గృహ నిర్మాణశాఖలో ఇంజనీరింగ్, ఇతర పరిపాలన అధికారులు, సిబ్బంది సమస్యను అధిగమించేందుకు ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఇంజనీర్లను, పాలనా సిబ్బందిని ఈ శాఖకు డిప్యూటేషన్‌పై పంపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు గృహ నిర్మాణశాఖ వర్గాలు చెబుతున్నాయి. పబ్లిక్ హెల్త్, టీజీఎంఎస్‌ఐడీసీ వంటి ఇంజనీరింగ్ విభాగాల నుంచి ఏఈలు, డీఈలు, ఈఈలను ఈ శాఖకు డిప్యూటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఇంజనీర్ల డిప్యూటేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని ఆశాఖ అధికారులు చెబుతున్నారు.
తొలివిడత 3,939 గృహాలకు త్వరలో ముగ్గు..
ఇందిరమ్మ గృహాల కోసం జిల్లాలో 3.09 లక్షల దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అధికారులు అందులో సొంత ఇంటి స్థలాలు ఉన్న అర్హులను గుర్తించారు. అయితే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన 25 గ్రామాల్లో తొలివిడతలో మొత్తం 3,939 గృహాలను మంజూరు చేశారు. ఈ గృహాల నిర్మాణం పనులకు త్వరలోనే ముగ్గు పోయనున్నారు. లబ్ధిదారులు పనులను షురూ చేసి అవి ఊపందుకునే సరికి అవసరమైన ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. తమశాఖకు అవసరమైన ఇంజనీర్లు, ఇతర సిబ్బందిని కేటాయింపుల విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని గృహ నిర్మాణశాఖ పర్యవేక్షక ఇంజనీర్ చలపతి ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు.
గృహ నిర్మాణశాఖలో ఇంజనీర్ల కొరత
గత ప్రభుత్వ హయాంలోఇతర శాఖలకు వెళ్లిన అధికారులు
తిరిగొచ్చిన వారు కూడా తక్కువే..
డిప్యూటేషన్‌పై ఇతరశాఖల నుంచి తీసుకోవాలని నిర్ణయం.!
Comments
Please login to add a commentAdd a comment