జహీరాబాద్: ఝరాసంగం మండలం మేదపల్లికి చెందిన మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకుంది. జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్‌ల సారథ్యంలో జనవరి 27న పరమేశ్వర్‌పాటిల్ కేసీఆర్‌ను కలిసేందుకు పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, మొగుడంపల్లి మండలాల నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లాయి. కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో జహీరాబాద్, సంగారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యేలు కె.మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, మాజీ జడ్పీటీసీలు స్వప్న, ఆర్.స్రవంతిరెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నారాయణ, వెంకటేశం, నర్సింహులు, సంజీవరెడ్డి, భాస్కర్, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్‌లు పాల్గొన్నారు.
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు సాధిస్తా
జహీరాబాద్ నియోజకవర్గానికి సంగమేశ్వర, నారాయణఖేడ్ నియోజకవర్గానికి బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా సాగు నీటిని అందించేందుకు వీలుగా ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే లక్షలాది ఎకరాల భూములు సాగులోకి వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా ప్రాజెక్టులను మరుగున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా ప్రాజెక్టుల నిర్మాణం పనులు ప్రారంభించాలని, వెంటనే టెండర్లు పిలవాలన్నారు. లేకుంటే మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. ఉద్యమంలో తాను ముందుండి నడిపిస్తానన్నారు. ఆయా ప్రాజెక్టులను ఎందుకు ఆపారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జహీరాబాద్ ప్రాంతమే ఉద్యమానికి స్ఫూర్తి
తాను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టడానికి జహీరాబాద్ ప్రాంతం కూడా స్ఫూర్తి అయిందని కేసీఆర్ పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి వ్యవసాయం చేయాలనుకున్నాని చెప్పారు. అయితే.. రాజులు, చౌదరిలకు సంబంధించిన భూములు వందలాది ఎకరాల్లో ఉన్నట్లు గమనించానని, తెలంగాణ రాకుంటే రైతుల చేతుల్లో నుంచి మొత్తం భూములు పోయే పరిస్థితిని గుర్తించానని, ఉద్యమానికి ఇది కూడా స్ఫూర్తి అయిందని కేసీఆర్ వివరించారు. తాను జహీరాబాద్ ప్రాంతంలోని అన్ని మండలాలను తిరిగానన్నారు. ఏడకులపల్లి, బడంపేట, గొటిగార్‌పల్లి తదితర చెరువులను అప్పట్లో చూశానని చెప్పారు. మొగుడంపల్లి ప్రాంతాల్లోని గోపన్‌పల్లి తదితర చెరువులను స్థితి గతుల గురించి ఆరా తీసినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కె.మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా ఫొటో
ఎర్రవల్లికి వెళ్లిన ప్రతి ఒక్క బీఆర్‌ఎస్ నేత, కార్యకర్తలతో కేసీఆర్ వ్యక్తిగతంగా ఫొటోలు దిగి జోష్ నింపా రు. సుమారు రెండు గంటల పాటు అందరితో కలిసి గడిపారు. అందరికీ భోజనలు ఏర్పాటు చేశారు.
పాదయాత్రికులకు అభినందన
ఝరాసంగం నుంచి పాదయాత్రగా సుమారు 140 కిలోమీటర్ల వరకు తన బృందంతో తనను కలవడానికి వచ్చిన మాజీ సర్పంచ్ పరమేశ్‌పాటిల్‌ను, ఆయన బృందాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
కార్యకర్తలను కార్యోన్ముఖులు చేసిన అధినేత కేసీఆర్
తెలంగాణ ఉద్యమానికి జహీరాబాద్ ప్రాంతమే స్ఫూర్తి
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు ఎందుకు ఆపారో చెప్పాలి
ఫామ్‌హౌస్‌లో శ్రేణులతో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment