వినియోగదారుడే మా దైవం
● విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం ● డీఈ రావుల కృష్ణయ్య
హుస్నాబాద్: విద్యుత్ సేవలు పొందుతున్న వినియోగదారుడు మాకు దైవంతో సమానమని డీఈ రావుల కృష్ణయ్య అన్నారు. విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ఆదివారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. రైతులు, వినియోగదారులు పాల్గొని తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ సరైన సమయంలో సేవలు అందకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పొలాల్లో, రోడ్ క్రాసింగ్ ఇతర ప్రదేశాల్లో వేలాడుతున్న తీగలు ఉన్నట్లు తమ దృష్టికి తెస్తే సరిచేస్తామన్నారు. తీగలను సరి చేసేటప్పుడు మధ్యలో స్తంభాలు వేయాల్సి ఉంటుందని దీనికి రైతులు, వినియోగదారులు సహకరించాలని కోరారు. గృహజ్యోతి పథకానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జీరో బిల్ కోసం ప్రజా పాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల్లో 4,158 మంది వినియోగదారులను అనర్హులుగా గుర్తించారని, వీరిలో రీ సర్వే చేసి 600 మందికి జీరో బిల్లుకు అవకాశం కల్పించామన్నారు. డివిజన్ పరిధిలో 1.06లక్షల మంది వినియోగదారుల్లో 52 వేల మంది మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించారని, మిగితా 54 వేల మంది వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేసుకునే వారికి నిర్మాణ అనుమతి అంటేనే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని తెలిపారు. గృహ జ్యోతి పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఈ ఉపేందర్, ఏఈ శశిధర్ రెడ్డి, విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment