ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమాయె..
సిద్దిపేటజోన్: ఉద్యోగులకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ వారిని మోసం చేసిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు పొన్నమల్ల రాములు పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. డిసెంబర్ వస్తే ఆరు డీఏలు పెండింగ్‌లో ఉంటాయని, 11 నెలలు గడిచినా కొత్త పీఆర్సీ లేదన్నారు. పాత పెన్షన్ విధానంపై ఇప్పటివరకు కమిటీ వేయలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 7 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పటికీ వారికి రిటైర్మెంట్ డబ్బులు రాలేదని ఆరోపించారు. గతంలో ఉద్యోగులు పదవీ విరమణ పొందితే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం వెంటనే డబ్బులు ఇచ్చేదన్నారు. తెలంగాణ ఉద్యమం, మద్యపాన నిషేధంపై ఉపాధ్యాయ సంఘం నేతగా రాములు నాతో కలిసి పనిచేసినట్టు పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సారయ్య, సుడా, మున్సిపల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment