స్థానిక మార్కెట్ల అభివృద్ధికి ప్రాధాన్యం
కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్స్‌లర్ రాజిరెడ్డి
ములుగు(గజ్వేల్): రైతులు షేడ్ నెట్లులో కూరగాయలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించొచ్చని, సబ్సిడీపై వాటిని అందించేలా ప్రభుత్వానికి నివేదిస్తామని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి అన్నారు. సోమవారం విశ్వవిద్యాలయంలోని ఆయన చాంబర్‌లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. కూరగాయల ఉత్పత్తుల మార్కెటింగ్ సమస్యను గమనిస్తున్నామన్నారు. షేడ్ నెట్లుతో సాగు ద్వారా సంవత్సరం పొడవునా కూరగాయల దిగుబడులు సాధించవచ్చునన్నారు. జిల్లాలవారీగా ఎక్కడి కూరగాయలు అక్కడే విక్రయించుకునేలా లోకల్ మార్కెట్‌ల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కూరగాయల హెచ్చుతగ్గుల కారణంగా తెలంగాణలో కూరగాయల సాగు తగ్గుతోందన్నారు. కోల్డ్ స్టోరేజీలు ఈ సమస్యకు పరిష్కారంగా నిలుస్తాయన్నారు. పంట కోతకు ముందు, కోత తర్వాత చేపట్టాల్సిన ఫ్రీ అండ్ పోస్ట్ హార్వెస్ట్ పద్ధతుల ద్వారా ఉద్యాన రైతులు అధిక ఉత్పత్తులు సాధించేలా చైతన్య పరుస్తామన్నారు. హైదరాబాద్‌లో పూల విస్తరణకు ఎంతో అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో గణనీయంగా తగ్గుతున్న బత్తాయి సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. కొత్తగా హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లను నెలకొల్పడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డీడీకి ప్రతిపాదనలు పంపామన్నారు. ములుగు మండలం కొట్యాలలో ఉన్న రీసెర్చ్ ఫామ్‌లో కూరగాయలు, పండ్ల మొక్కలు, పూలమొక్కలను పెంచి మోడల్ రీసెర్చ్ ఫామ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment