సాగు..తున్న ఎల్‌ఆర్‌ఎస్
మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ (లే–అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. దరఖాస్తుల పరిశీలనకు నియమించిన కమిటీలు.. నివేదికలు ఇవ్వడంలో ఆలస్యమవుతోంది. కుల గణన సర్వేలో అధికారులు భాగస్వాములు కావడం.. సమన్వయ లోపం.. తదితర కారణాలతో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఫలితంగా దరఖాస్తుల పరిశీలనలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది.
గజ్వేల్: జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ (లే–అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)కు ఎదురుచూపులు తప్పడం లేదు. 2020 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగానే సిద్దిపేట మున్సిపాలిటీలో 33వేలు, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో 11,548, దుబ్బాకలో 2,900, హుస్నాబాద్‌లో 3,500, చేర్యాలలో మరో 6,750 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 57వేలకుపైనే వచ్చాయి. రూ.1000 ప్రాథమిక చార్జితో దరఖాస్తులు అందజేశారు. నాలుగున్నరేళ్లుగా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పెండింగ్‌లో పడుతూ వచ్చింది.
ఇప్పటికీ 35 శాతంలోపే..
గతేడాది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో 35శాతం లోపే పరిశీలించారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 11,548 దరఖాస్తులకు ఇప్పటివరకు 3వేలకుపైగా దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది. పరిశీలన పూర్తయిన వారికి సెల్‌ఫోన్ సందేశాలు పంపించారు. వారు చెల్లించాల్సిన ఫీజు వివరాలను కూడా సందేశంలో పంపించారు. ఇందులో ఇప్పటివరకు 60మంది ఫీజును సైతం చెల్లించగా...వారికి ప్రోసీడింగ్‌లను కూడా అందజేశారు. ఇకపోతే పత్రాలు సక్రమంగా లేవని 380 దరఖాస్తులను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వివాదాలు, ఇతర కారణాల వల్ల 130 అప్లికేషన్లు తిరస్కరించారు. జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే తరహాలో కొనసాగుతోంది.
త్వరలోనే పూర్తి చేస్తాం
ఎల్‌ఆర్‌ఎస్ అంశంపై గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య మాట్లాడుతూ ప్రభు త్వ నిబంధనల ప్రకారం దరఖాస్తుల పరిశీలన జరుగుతోందని చెప్పా రు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు.
జాప్యానికి కారణాలేమిటీ?
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు మున్సిపాలిటీల వారీగా నియమించిన కమిటీలో రెవెన్యూ శాఖ నుంచి ఆర్‌ఐ, ఇరిగేషన్ శాఖ నుంచి ఏఈ, మున్సిపల్ శాఖ నుంచి టీపీఓలు సభ్యులుగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ కమిటీ దరఖాస్తుదారులు చూపిన ప్లాట్లు ప్రభుత్వ భూమి పరిధిలో ఉన్నాయా?, నిషేధిత జాబితా (పీఓబీ), ఎఫ్‌టీఎల్(చెరువుల శిఖం) పరిధిలో ఉన్నాయా? అనే విషయాలను క్షణ్ణంగా విచారణ జరుపుతోంది. లేవని నిర్ధారించుకున్న తర్వాతే మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తు ఆమోదం కోసం నివేదిక ఇస్తుంది. ఇవే కాకుండా ఇతర వివాదాలు ఉంటే కూడా కమిటీ పరిశీలన చేయాల్సి ఉంటుంది. లేదంటే దరఖాస్తును తిరస్కరించాలని సూచిస్తోంది. ప్రధానంగా ఈ ప్రక్రియలో జాప్యం కొనసాగుతోంది. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం కులగణన సర్వే ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టడం వల్ల...ఈ సర్వేలో మున్సిపల్ సిబ్బంది భాగస్వాములు కావడం వల్ల ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ముందుకుసాగకపోవడానికి మరో కారణంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం కూడా అవరోధంగా మారుతోంది.
పరిశీలనలో ఎన్నో చిక్కులు
జిల్లాలో 57వేలకుపైగా దరఖాస్తులు
ఇప్పటి వరకు పూర్తయ్యింది35 శాతంలోపే
ఎంక్వాయిరీలో తీవ్ర జాప్యం
Comments
Please login to add a commentAdd a comment