గురువు ఆచ్రేకర్‌తో సచిన్ చిన్ననాటి ఫొటో (PC: Sachin RT X)
‘‘నా జీవితంలో మొట్టమొదటిసారి... సాహిత్య సహవాస్ కాలనీలో ఉన్న నా స్నేహితులందరినీ పిలిచి.. మ్యాచ్ చూడాలని చెప్పాను. ఎందుకంటే అప్పుడు నేనే మా కాలనీ ప్రధాన బ్యాటర్‌ని.
మా వాళ్లంతా నా ఆట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నేను మొదటి బంతికే అవుటయ్యాను. అందరిలోనూ నిరాశ.
మరి గల్లీ క్రికెట్‌లో కొన్సి మినహాయింపులు ఉంటాయి కదా. అందుకు తగ్గట్లుగానే.. బంతి కొంత తక్కువ ఎత్తులో వచ్చిందని నా బ్యాటింగ్ తీరును సమర్థించుకున్నాను. ఆ తదుపరి మ్యాచ్‌కు కూడా వాళ్లను రమ్మన్నాను.
ఈసారి కూడా సున్నాకే అవుట్. బంతి ఎత్తులో వచ్చిందని తప్పు నాది కాదు.. పిచ్‌దేనని తప్పించుకున్నా. అయితే, మూడో మ్యాచ్‌కు మాత్రం వాళ్లను పిలవలేదు. వాళ్ల సమయాన్ని వృథా చేయడం ఎందుకులే అనిపించింది.
అయితే, ఈసారి నేను ఒక్క పరుగు చేసి అవుటయ్యాను. 5-6 బంతులు ఆడిన తర్వాత ఒక్క పరుగు చేసి మైదానం వీడాను. అయినప్పటికీ నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. శివాజీ పార్కు నుంచి బాంద్రాకు బస్సులో వెళ్లేటపుడు ఎంతో సంతృప్తిగా అనిపించింది.
నేను ఒక్క పరుగైనా చేశాననే ఆనందం. అప్పుడే నాకు ఆ ఒక్క పరుగు విలువ తెలిసింది. అలాంటి ఒక్క పరుగు వల్లే గెలుపోటములు కూడా ఆధారపడి ఉంటాయని తర్వాత చాలా మంది నాకు చెప్పారు.
ఏదేమైనా తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయి, ఆ తర్వాత ఒక పరుగైనా చేయడం నాకు సంతృప్తిని ఇవ్వడంతో పాటు నా ఆలోచనా ధోరణిని మార్చింది’’ అని టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ అన్నాడు.
ఇండియన్ స్ట్రీట్ లీగ్ ఈవెంట్లో భాగంగా యువ క్రికెటర్లను ఉద్దేశించి ఈ మేరకు స్పూర్తిదాయక ప్రసంగం చేశాడు. గల్లీ క్రికెట్ ఆడేటపుడే బ్యాటర్‌గా తనకు ఒక్క పరుగు విలువ తెలిసి వచ్చిందని... ఆట పట్ల నిబద్ధత, అంకితభావం ఉంటే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని సచిన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
కాగా టీమిండియా తరఫున సుమారు 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండుల్కర్ లెజెండరీ బ్యాటర్‌గా అనేక ఘనతలు సాధించాడు. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీల వీరుడిగా ఇంత వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు నమోదు చేసి.. శిఖరాగ్రాన నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment