తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఘెర పరాజయం అనంతరం పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. పాక్‌పై సంచలన విజయం అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ ఆరో స్థానానికి ఎగబాకింది.
ఈ రెండు మార్పులు మినహా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు జరగలేదు. 68.52 విజయాల శాతంతో భారత్ టాప్‌లో కొనసాగుతుండగా.. 62.50 విజయాల శాతంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో.. 50 శాతం విజయాలతో న్యూజిలాండ్ మూడులో.. 41.07 విజయాల శాతంతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో.. 40 శాతం విజయాలతో శ్రీలంక ఐదో స్థానంలో ఉన్నాయి. 38.89 విజయాల శాతంతో సౌతాఫ్రికా ఏడులో.. 18.52 విజయాల శాతంతో వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.
కాగా, రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్ విజయం. పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.
స్కోర్ వివరాలు..
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్)
Comments
Please login to add a commentAdd a comment