క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది.
ఈ సిరీస్ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ బెర్త్‌లను ఖరారు చేస్తుంది. ఈ కారణంగా ఈ సిరీస్‌కు ప్రాధాన్యత మరింత పెరిగింది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే ఈ సిరీస్‌లో ఆసీస్‌ను 4-0 తేడాతో ఓడించాల్సి ఉంది.
ఇలా జరగడం అంత ఆషామాషి విషయమేమీ కాదు. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలంటే భారత్ ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. భారత్ ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం (0-3 తేడాతో సిరీస్ కోల్పోయింది) ఎదుర్కొంది. దీని ప్రభావం బీజీటీపై ఎంతో కొంత ఉంటుంది.
మరోవైపు ఈ సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల సమస్య వేధిస్తుంది. తొలి టెస్ట్‌కు శుభ్‌మన్ గిల్ అందుబాటులో ఉండడని సమాచారం. వ్యక్తిగత కారణాల (రెండో సారి తండ్రైనందున) చేత రోహిత్ తొలి టెస్ట్‌కు దూరం కానున్న విషయం తెలిసిందే.
నలుగురు పేసర్లతో అటాక్ చేయనున్న ఆసీస్
తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా టీమిండియాను నలుగురు పేసర్లతో అటాక్ చేయనుంది. పేస్ త్రయం పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌తో పాటు మిచ్ మార్ష్ టీమిండియాపై నిప్పులు చెరగనున్నారు. పెర్త్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. భారత బ్యాటర్లు ఆసీస్ పేసర్లను ఏమేరకు ఎదుర్కొంటారో వేచి చూడాలి.
ఆసీస్ బ్యాటింగ్ విభాగం విషయానికొస్తే.. డేవిడ్ వార్నర్‌కు రీప్లేస్‌మెంట్‌గా నాథన్ మెక్‌స్వీని బరిలోకి దిగడం దాదాపు ఖరారైపోయింది. మెక్‌స్వీని.. ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. వన్‌డౌన్‌లో మార్నస్ లబూషేన్ బరిలోకి దిగనుండగా.. స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు.
ఐదో స్థానంలో ట్రవిస్ హెడ్ బరిలోకి దిగనుండగా.. ఆల్‌రౌండర్‌గా మిచ్ మార్ష్.. వికెట్‌కీపర్‌గా అలెక్స్ క్యారీ బరిలో ఉంటారు. తొలి టెస్ట్‌లో ఆసీస్ ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. స్పిన్ విభాగం నుంచి నాథన్ లియోన్ బరిలో ఉంటాడు.
భారత్‌తో తొలి టెస్ట్ ఆసీస్ తుది జట్టు (అంచనా)..
ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, నాథన్ లియోన్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్
Comments
Please login to add a commentAdd a comment