టెండర్ ధర కంటే తక్కువ ఉండకూడదు
డ్రెడ్జింగ్.. టెండర్.. లాటరీ.. ఏదైనా తమ్ముళ్లకే!
● నియమ, నిబంధనల్లో లోపించిన పారదర్శకత
● ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే అత్యంత తక్కువకు కోట్
● అప్పారావుపాళెం, పల్లిపాడు రీచ్‌ల టెండర్ల ఖరారులో
అధికారుల అత్సుత్సాహం
● కోవూరులో ఒక విధంగా.. ఆత్మకూరులో మరో విధంగా..
● గతంలో లాటరీ విధానంపై కోర్టుకెళ్లిన కాంట్రాక్టర్లు
● మరోసారి కోర్టు మెట్లెక్కనున్న టెండర్‌దారులు
జిల్లాలో ఇసుక తవ్వకాల టెండర్ల ప్రక్రియలో అధికార యంత్రాంగం దుర్వినియోగానికి పాల్పడుతోంది. టెండర్ల విధివిధానాలు రూపొందించడం నుంచి ఖరారు వరకు పారదర్శకత లోపించడంతో ఈ ప్రక్రియ అభాసుపాలవుతోంది. అధికారుల అత్యుత్సాహం మరోసారి వివాదంగా మారింది. రీచ్.. రీచ్‌కు నిబంధనలు మార్చేసి.. అధికార పార్టీ నేతలకు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఒకసారి కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్లు మరోసారి న్యాయస్థానం మెట్లెక్కేందుకు సిద్ధమవుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకుండానే ఇసుక తవ్వకాలకు ఇష్టారాజ్యంగా అనుమతులివ్వడమే కాకుండా, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు మున్ముందు దోషులుగా నిలిచే పరిస్థితులు అనివార్యమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా పరిపాలన యంత్రాంగం ఇసుక టెండర్ల వ్యవహారంలో చేస్తున్న తప్పిదాలు తలబొప్పి కట్టిస్తున్నాయి. పెన్నానదిలో ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి తీసుకోవాలి. కానీ ఇందుకు విరుద్ధంగా జిల్లా అధికార యంత్రాంగం అత్యుత్సాహంతో పూడిక తీత, యంత్ర రహితంగా ఇసుక తవ్వకాలంటూ ఇష్టారీతిన అధికార పార్టీ నేతలకు కట్టబెట్టుతున్నారు. అసలు టెండర్ల ప్రక్రియకు విధివిధానాలు లేకుండా ఆహ్వానించడం, చివరాఖరుకు ఎమ్మెల్యేలు చెప్పిన వారికే అనుమతి ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తాజాగా జిల్లాలో అప్పారావుపాళెం, పల్లిపాడు రీచ్‌లకు సంబంధించి ఈ రెండు చోట్ల రెండు రకాల నిబంధనలు అమలు చేసి టీడీపీ నేతలకే కట్టబెట్టాడం వివాదాస్పదమవుతోంది. గతంలో జిల్లాలోని నాలుగు రీచ్‌లకు సంబంధించి ఇదే రీతిలో అధికారులు వ్యవహరించడంతో కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. తాజా టెండర్ల వ్యవహారంపై కూడా మరోసారి న్యాయస్థానంను ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు.
అప్పారావుపాళెంలో అలా..
పల్లిపాడులో ఇలా..
జిల్లాలో ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం, ఇందుకూరుపేట మండలం పల్లిపాళెంలో ఇసుక రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు టెండర్లు ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం వాటిని ఓపెన్ చేశారు. ఈ రెండు రీచ్‌లకు సంబంధించి జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువు బినామీ పేర్లతో టెండర్లు దాఖలు చేశారు. అప్పారావుపాళెం రీచ్‌లో నాలుగు టెండర్లు బెస్ట్ ప్రైస్ ధరకే కోట్ చేయడంతో ఇక్కడ లాటరీ విధానంతో చివరాఖరుకు సదరు ఎమ్మెల్యే బంధువు కాంట్రాక్ట్ సంస్థ మిలీనియం స్టీల్స్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కే కట్టబెట్టారు. అదే పల్లిపాడులో ఐదుగురు టెండర్లు అర్హత సాధించినా.. బెస్ట్ ప్రైస్ కంటే తక్కువకు కోట్ చేసిన అదే ఎమ్మెల్యే బంధువు బినామీ భరణికుమార్‌కే కట్టబెట్టారు. పేరుకు టెండర్ల ప్రక్రియే.. కానీ చివరికి టీడీపీ నేతలకే కాంట్రాక్ట్ ఖరారు చేయడంలో అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది.
గతంలో టెండర్లు పిలిచి రద్దు చేసి..
గతంలో పెన్నానదిలో నాలుగు చోట్ల ఇసుక తవ్వకాలకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పట్లో మినగల్లు, పడమటికంభంపాడు, పల్లిపాడు, విరువూరులో ఓపెన్ రీచ్‌ల ద్వారా 2.86 లక్షల మెట్రిక్ టన్నుల ఇసును అందుబాటులోకి తెచ్చేందుకు టెండర్లు ఆహ్వానించారు. ఆయా రీచ్‌లకు 23 మంది కాంట్రాక్టర్లు 43 దరఖాస్తులు దాఖలు చేశారు. ఒకటి జీఎస్టీ సక్రమంగా లేకపోవడంతో రద్దయింది. మిగిలిన దరఖాస్తులు అర్హత సాధించాయి. అయితే బెస్ట్‌ప్రైస్ కోట్ చేసిన టెండర్లను మాత్రమే లాటరీ విధానంలో కేటాయించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ఒక మంత్రి ఆదేశంతో అందరిని కలిపి లాటరీ ప్రక్రియను చేపట్టారు. దీంతో టీడీపీ వర్గీయులకు కాకుండా ఇతరులకు టెండర్ రావడంతో మరో మంత్రి భగ్గుమంటూ ఏకంగా టెండర్లనే రద్దు చేయించి, తమ పార్టీ నేతలకే నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టించారు. దీంతో లాటరీలో రీచ్‌లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లారు.
డీసిల్టేషన్ కాంట్రాక్టర్ల విషయంలోనూ అంతే
నెల్లూరు, సంగం బ్యారేజీల సమీపంలో డీసిల్టేషన్ ద్వారా ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో డంపింగ్ యార్డులు పెట్టారు. రోజుకు ఆరు వేల టన్నులను సేకరించేలా నిర్ణయించారు. ఈ మేరకు రెండు నెలల క్రితం ఇరిగేషన్ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రక్రియలో 15 మంది దరఖాస్తులు చేయడంతో అందరూ అర్హత సాధించినట్లు తేల్చిన అధికారులు అందరూ కలిసి డ్రెడ్జింగ్ ద్వారా తవ్వకాలు చేపట్టాలని అనుమతులు ఇచ్చారు. అయితే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ ముఖ్య అనుచరులకు ఆ మూడు డంపింగ్ యార్డులు అప్పగించేలా చేశారు. మిగిలిన వారికి అగ్రిమెంట్లు ఇవ్వకుండా రెండు నెలలుగా వేధిస్తున్నారు. ఇటీవల ఇరిగేషన్ అధికారులు అగ్రిమెంట్లు ఇచ్చారు. కానీ బోట్లు పెట్టుకునే ప్రదేశం చూపించలేదు. ప్రస్తుతం డంపింగ్ యార్డులకు ఇసుక రవాణా చేసే ఆ ముగ్గురు కాంట్రాక్టర్లు అర్హత లేని వారని, మిగిలిన కాంట్రాక్టర్లు హైకోర్టు కెళ్లడంతో వారిని ప్రోసిడింగ్స్‌ను తప్పించాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇరిగేషన్ అధికారులు మాత్రం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తేదీ ముందు రోజే అగ్రిమెంట్లు ఇచ్చినట్లుగా తయారు చేసి కోర్టునే తప్పదోవ పట్టించారు. కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టేశారు.
వాస్తవానికి ఇసుక తవ్వకాలకు సంబంధించి అధికార యంత్రాంగం టన్ను లోడింగ్‌కు రూ.25 కనీస ధర ప్రకటించింది. నిర్దేశించిన ధర (బెస్ట్ ప్రైస్) కంటే తక్కువకు ఎవరూ వేయకూడదు. ఒక వేళ ఎక్కువ మంది బ్రేస్ ప్రైస్‌కే కోట్ చేస్తే లాటరీ విధానంలో కేటాయించాలి. కానీ గతంలోనూ, ఇప్పుడూ బెస్ట్ ప్రైస్ కంటే తక్కువ వేసిన టీడీపీ నేతలకే కట్టబెట్టేందుకు పరిస్థితులను, అవకాశాలను అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టెండర్ల ఖరారు చేసి కట్టబెట్టిన వైనం చూస్తే ఇది స్పష్టమవుతోంది.
అప్పారావుపాళెం రీచ్‌కు 6 సీల్డ్ టెండర్లు రాగా అందులో రెండు రిజెక్ట్ అయ్యాయి. మిగిలిన నాలుగు అర్హత సాధించాయి. ఇందులో ఓ ఎమ్మెల్యే సమీప బంధువు టన్ను ఇసుక లోడింగ్ రూ.4.90కు కోట్ చేశారు. మిగిలిన వారు బెస్ట్ ప్రైస్ రూ.25 వంతున కోట్ చేశారు. అక్కడ మాత్రం లాటరీ విధానం అమలు చేశారు. ఈ నాలుగులో మెజార్టీ టెండర్లు ఒకే సంస్థ వేయడంతో దానికే టెండర్ దక్కిందని సమాచారం.
ఇక పల్లిపాడు రీచ్‌కు సంబంధించి 8 టెండర్లు రాగా మూడు రిజెక్ట్ కావడంతో ఐదు అర్హత సాధించాయి. ఇక్కడ కూడా బెస్ట్ ప్రైస్ టన్ను ఇసుక లోడింగ్‌కు రూ.25 నిర్దేశించగా సదరు ఎమ్మెల్యే బంధువు బినామీ భరణికుమార్ రూ.17.50కే టెండరు కోట్ చేయగా, మిగిలిన నలుగురు బెస్ట్‌ప్రైస్ రూ.25 వంతున కోట్ చేశారు. ఇక్కడ మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, బెస్ట్ ప్రైస్ కంటే తక్కువ ధరకు టెండర్ ఖరారు చేయకూడదనే నిబంధనను తోసిరాజేసి ఎమ్మెల్యే బంధువు బినామీకే కట్టబెట్టారు.
జిల్లాలో ఇసుక తవ్వకాలకు సంబంధించి అనుమతులు డీసిల్టేషన్.. టెండర్లు, లాటరీ అయినా.. చివరాఖరుకు టీడీపీ నేతలకే కట్టబెడుతూ జిల్లాలో ఇసుక దోపిడీకి అధికార యంత్రాంగం ఇతోదికంగా సాయపడుతోంది. ఇసుక వ్యవహారంలో అధికారుల తీరు రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకుండా.. ఇలా ఇష్టారీతిన ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తూపోవడంతో రోజుకు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఈ స్థాయిలో ఇసుక తవ్వకాలు చేస్తున్నా.. జిల్లాలో మాత్రం ఇసుక కొరత వేధిస్తుండడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment