తిరుమనకొండపై లలితా రుద్ర మహాయజ్ఞం
సంగం: సంగంలోని తిరుమనకొండపై కొలువైన రాజరాజేశ్వరిదేవి ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి–పంటలతో లోకకల్మాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం 45 రోజులుగా నిర్వహిస్తున్న లలితా రుద్ర మహాయజ్ఞం కార్తీక పౌర్ణమి శుక్రవారంతో పూర్తయింది. శివపార్వతులకు సకల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పీఠాధిపతి రాజరాజేశ్వరానందస్వామితో పాటు వేద పండితులు లలితా రుద్ర మహాయజ్ఞం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. దశ మహా విద్యాదేవతలు లలితా సహస్రనామ, షోడశ లక్ష్మీ దేవతా మంత్రాలతో యజ్ఞం నిర్వహించినట్లు పీఠాధిపతి రాజరాజేశ్వరానందస్వామి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భజన బృందాలు ఆలపించిన గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం స్త్రోత్ర పారాయణం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ రాజుల కాలం నుంచి నిర్వహిస్తున్న యజ్ఞ యాగాదులు నేడు తిరుమనకొండలో నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం కోటి దీపార్చన నిర్వహించి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమ్లానాయక్, చెర్లోవంగల్లు భీమేశ్వరాలయ చైర్మన్ పగడాల రఘురామయ్య, వైద్యాధికారిణి దేవసేనమ్మ, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలు, వైఎస్సార్‌సీపీ నాయకులు గూడూరు కృష్ణారెడ్డి, అల్లూరు శేషారెడ్డి, భాస్కర్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment