డిజిటల్ అరెస్ట్.. ఇదో కొత్త స్కాం
నెల్లూరు(క్రైమ్): ‘సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీబీఐ, ఈడీ, కస్టమ్స్, ఏసీబీ అధికారులమంటూ ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మొద్దు. డిజిటల్ అరెస్ట్‌లాంటివి అసలు ఉండవు’ అని ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. సైబర్ నేరాలపై సోషల్ మీడియాలో పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన గురువారం వెల్లడించారు. ఇంకా విద్యాసంస్థల్లో కూడా విద్యార్థులకు వివరిస్తున్నట్లు తెలిపారు.
ఏం చేస్తున్నారంటే..
ఓ వైపు సాంకేతికత సరికొత్త పుంతలు తొక్కుతుంటే మరోవైపు సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో సరికొత్త మోసాలకు తెరలేపారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వస్తుంది. తాను ముంబైలోని కొరియర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకుంటాడు. మీ పేరుతో విదేశాల నుంచి పార్శిల్ వచ్చిందంటారు. మాకు కొరియర్ రావాల్సిన వస్తువులేమీ లేవని తెలిపినా.. అవతలి వ్యక్తి వినకుండా మీ పేరు, ఫోన్ నంబర్ తెలిపి కొరియర్‌లో డ్రగ్స్, ఆయుధాలున్నాయని భయభ్రాంతులకు గురిచేస్తారు. అదే సమయంలో మీ ఆధార్, పాన్, బ్యాంకు వివరాలను మీ ద్వారానే తెలుసుకుని ముంబై సైబర్‌క్రైమ్/నార్కోటిక్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కాల్ కట్ చేస్తారు. కొద్దిసేపటికి ముంబై సైబర్‌క్రైమ్ పోలీసు విభాగం నుంచి ఫోన్ చేస్తున్నానంటూ మరో వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వస్తుంది. మీ పేరుపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ నకిలీ పత్రాలను వాట్సప్‌లో పంపిస్తారు. మిమ్మల్ని హోటల్ రూమ్ లేదా ఇంట్లోనే ఒక గదిలో ఒంటరిగా ఉంటే విచారణ చేస్తామని నమ్మిస్తారు. విచారణ పూర్తయ్యేంత వరకు కదలడానికి వీల్లేదంటూ కట్టడి చేస్తారు. అనంతరం వీడియో కాల్లో మాట్లాడుతూ మీ వ్యక్తిగత సమాచారం మొత్తం తెలుసుకుంటారు. కేసు నుంచి బయట పడాలంటే తాము చెప్పినంత మొత్తం చెల్లించాలని లేదంటే అరెస్ట్ తప్పదని కంగారు పెడతారు. వారు అడిగినంత ఖాతాలో జమయ్యాక వదిలేస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మోసగాళ్లు చెప్పేవి నిజమని భావించొద్దు. అసలు డిజిటల్ అరెస్ట్‌లనేవి లేవు. ఇదో పెద్ద స్కాం. సీబీఐ, నార్కోటిక్స్, ఈడీ నుంచి మాట్లాడుతున్నామని ఎవరైనా చెబితే కచ్చితంగా అనుమానించాలి. దేశంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియోకాల్లో విచారణ చేయదు. అలా చేస్తే వారు సైబర్ నేరగాళ్లని అర్థం చేసుకోవాలి. ఇలాంటి మోసపూరిత ఫోన్‌కాల్ వస్తే సమీప పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోరాదు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930 లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ జి.కృష్ణకాంత్
Comments
Please login to add a commentAdd a comment