అంచెలంచెలుగా ఎదిగి..
● దారుణహత్యకు గురైన హాసిని
● కోస్తా, రాయలసీమ హిజ్రా నేతగా గుర్తింపు
కొడవలూరు: మండలంలోని టపాతోపు అండర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి హత్యకు గురైన మానికల హాసిని (33) చిన్నప్రాయంలోనే తక్కువ సమయంలోనే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, చైన్నె, కర్ణాటక ప్రాంతాల్లోని సుమారు పది వేల మందికి హాసిని నాయకురాలుగా ఎదిగింది. ఆమె ఎదుగుదలను జీర్ణించుకోలేని హిజ్రాల్లోనే మరోవర్గం ఈ కిరాతకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు గిరిజన కాలనీకి చెందిన మానికల శ్రీనివాసులు, విజయమ్మ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లవాడు. మధ్య సంతానంగా మగ పిల్లవాడిగా జన్మించిన సుదీప్ మొదటి నుంచి తేడాగా ఉండేవాడు. తండ్రి టైలర్ కాగా, తల్లి విజయమ్మ వ్యవసాయ పనులకు వెళుతూ ముగ్గురు పిల్లలను చదివించారు. ఏడో తరగతి వరకు గ్రామంలోని పాఠశాలలోనే చదివిన సుదీప్ ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయారు. అప్పటికే హిజ్రా లక్షణాలు కలిగి ఉన్న సుదీప్ హిజ్రాలతో పరిచయం పెంచుకుని పూర్తిగా హిజ్రాగా మారి హాసినిగా పేరు మార్చుకున్నారు. ఆకర్షణీయంగా కనిపించే హాసిని హిజ్రాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ నాయకత్వ బాధ్యతలు తీసుకుంది. ఆర్థికంగా స్థిరపడ్డాక కుటుంబాన్ని తిరుపతికి మార్చుకుంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో హిజ్రాల సమస్యలపై తరచూ సమావేశాలు నిర్వహి స్తూ వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్థికంగానూ బలపడడంతో నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో ఒక ఇల్లు, రాజీవ్‌గాంధీనగర్‌లో రెండు ఇళ్లు, తిరుపతిలో ఒక ఇల్లు నిర్మించుకున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులకు చిన్నచెరుకూరులో ఇల్లు నిర్మించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండేదని సమాచారం. హాసిని తల్లి స్వగ్రామం విడవలూరు మండలం పార్లపల్లిలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించింది. నిర్మాణం పూర్తికావడంతో సోమవారం నుంచి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నా యి. దీంతో మంగళవారం జరిగిన అభిషేకాలు, పూజలకు హాసిని తన సహచర హిజ్రాలు 20 మందిని తీసుకెళ్లారు. అక్కడ రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు, పూజల అనంతరం అక్కడి నుంచి నెల్లూరుకు బయలు దేరారు. హాసిని కారులో వస్తుండగా సహచరులు ఆటోల్లో వెనుక అనుసరించారు. టపాతోపు అండర్ పాస్ వద్ద రెండు కార్లలో కాపుకాచిన ఆరుగురు వ్యక్తులు అటకాయించి కారులో ఉన్న హాసిని మెడపై విచక్షణా రహితంగా నరికి పారిపోయారు. వెనుక ఆటోల్లో వచ్చిన సహచరులు గమనించి చూడగా హాసిని రక్తపు మడుగులో పడి ఉంది. హుటాహుటిన నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే హాసిని మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్సై కోటిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు?
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సంచలనం రేకెత్తించిన హాసిని హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కొడవలూరు ఇన్‌స్పెక్టర్ సురేంద్రబాబు తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరురూరల్ మండలానికి చెందిన ఓ యువకుడు ఓ హిజ్రా గ్యాంగ్‌లో ఉన్న హిజ్రా తో సహజీవనం చేస్తున్నారు. ఆ యువకుడిని హాసిని, ఆమె అనుచరులు పలుమార్లు అందరి ముందు తీవ్రంగా అవమానించినట్లు సమాచారం. దీంతో కక్ష పెంచుకున్న సదరు యువకుడు తన సహచరులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సాంకేతికత ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. హాసిని ఆదిపత్యాన్ని కొందరు హిజ్రాలూ వ్యతిరేకిస్తున్నారు. వారు సోషల్ మీడియా వేదికగా హాసినిని దూషిస్తూ పోస్టులు పెట్టడం, బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
మార్చురీ రహదారిలో బైఠాయించిన హిజ్రాలు
హంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలి
మార్చురీ ఎదుట సహచరుల ధర్నా
పోస్టుమార్టం అనంతరం అశ్రునయనాల మధ్య మృతదేహం తిరుపతికి తరలింపు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన హిజ్రా హాసిని హత్యోదంతం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కలకలం రేకెత్తించింది. ఆమె సహచరులు కడప, చిత్తూరు, తిరుపతి, తమిళనాడు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో బుధవారం తెల్లవారు జామునే నెల్లూరుకు చేరుకున్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హాసిని మృతదేహం జీజీహెచ్ మార్చురీలో ఉండడంతో కొందరు అక్కడికి వచ్చి అక్కడే బైఠాయించగా మరికొందరు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును ఆయన ఇంటి వద్ద కలిశారు. తమ నాయకురాలు హత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. చట్ట ప్రకారం విచారణ జరిపి నిందితులను శిక్షిస్తామని డీఎస్పీ వెల్లడించడంతో జీజీహెచ్‌లోని మార్చురీ వద్దకు చేరుకున్నారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహించి బాధితులకు అప్పగించారు. అశ్రునయనాల మధ్య హాసిని మృతదేహాన్ని అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ రోశయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ రమేష్‌బాబు తమ సిబ్బందితో కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment