నెల్లూరు(అర్బన్): బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుఫాన్‌గా మారనుందని వాతావరణశాఖ ప్రకటించింది. దీనికి ‘ఫెంగల్’ అని నామకరణం చేశారు. ఈ తుఫాన్ శ్రీలంక వైపు కదిలిపోతుందనుకుంటుంటే.. దిశ మార్చుకుని తమిళనాడు వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఆ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ తుఫాన్ ముప్పు చైన్నె సరిహద్దులో ఉన్న నెల్లూరు జిల్లాకు ఉంటుందని, ఈనెల 28 నుంచి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టులో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కలెక్టర్ ఆనంద్ జిల్లా అధికారులందరినీ అప్రమత్తం చేశారు. భారీవర్షాలు పడితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకోవాలని సూచించారు. మరో వైపు అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 0861–2331261కు ప్రజలు సహాయం కోసం ఫోన్ చేయొచ్చని తెలిపారు. శనివారం (ఈనెల 30వ తేదీ) నాటికి తుఫాన్ తమిళనాడు ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
పోర్టులో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment