ఠారెత్తిస్తున్న టమాటా ధర
నెల్లూరు (సెంట్రల్): టమోటా రేట్లు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు నెల్లూరులోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు అమాంతంగా రేట్లు పెంచుతుంటారు. మొన్నటి వరకు కిలో టమాటా రూ.40 ఉండగా, తాజాగా కిలో రూ.80కు చేరింది. రిటైల్ మార్కెట్‌లో రూ.90 వరకు విక్రయాలు చేస్తున్నారు. టమాటాలు రైతుల వద్ద విరివిగా దొరుకుతున్నా మార్కెట్ వ్యాపారులు మాత్రం కొనుగోలుదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. వీటితో పాటు ఉల్లిపాయలు, వంకాయలు ఇతర కొన్ని కూరగాయలు కూడా కిలో రూ.70 దాకా విక్రయాలు చేస్తున్నారు.
1న జిల్లా స్విమ్మింగ్
జట్ల ఎంపిక
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్ర స్థాయి అమెచ్యూర్ ఆక్వాటిక్ పోటీల్లో పాల్గొనే జిల్లా స్విమ్మింగ్ జట్ల ఎంపిక డిసెంబర్ 1వ తేదీన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం స్విమ్మింగ్ ఫూల్‌లో ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సుంకర మధు, కె.సనత్‌కుమార్ బుధవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు విశాఖపట్నంలో డిసెంబర్ 7వ తేదీన జరిగే సబ్ జూనియర్, జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టుగా పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంపికలకు హాజరయ్యే వారు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని వివరించారు. ఈ నెల 30వ తేదీలోపు తమ పేర్లను స్విమ్మింగ్ అసోసియేషన్ ట్రెజరర్ ఎస్.శివశంకర్‌రెడ్డి వద్ద నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు డీఎస్‌ఏ కోచ్ నాగరాజును 8801916198 నంబరులో సంప్రదించాలని సూచించారు.
8న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
నెల్లూరు (టౌన్): జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) డిసెంబర్ 8న నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లను పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్‌సైట్ www.bse.ap.gov. inలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాల యూడైస్ కోడ్‌ను ఉపయోగించి లాగిన్ అయి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలన్నారు.
పక్కాగా సాగునీటి
సంఘాల ఎన్నికలు
నెల్లూరు రూరల్: సాగునీటి సంఘాల ఎన్నికలను పక్కాగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని సోమశిల ప్రాజెక్ట్ ఈఈ మల్లికార్జున అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, పోటీలో నిలిచిన అభ్యర్థి, ఏకగ్రీవంగా ఎంపికై న అభ్యర్థి ప్రకటన అంశాలకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. డీఈ అంకమ్మరావు, పలువురు డీఈలు, ఏఈలు, తహసీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment